Begin typing your search above and press return to search.

బీసీలతో కూటమి కుదేలే

By:  Tupaki Desk   |   15 Nov 2018 4:45 AM GMT
బీసీలతో కూటమి కుదేలే
X
తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలలో మహాకూటమికి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. టిక్కెట్ల పంపిణీ వరకు కాసింత అనుకూలంగా ఉన్నట్లు కనిపించినా, అభ్యర్దుల ప్రకటన తర్వాత ఆ ఊపిరి కూడా పోయే పరిస్దితి కనపడుతోంది. ముఖ్యంగా బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీని బీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికలలో మలక్‌పేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్దిగా గెలిచిన బీసీ నేత ఆర్. క్రిష్ణయ్య సైకిల్ దిగిపోయారు. ఆయన పార్టీలో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి మంచి దన్ను ఉండేది. ఇప్పుడు ఆ బలం పోయింది. ఈ ఎన్నికలలో పోటికి క్రిష్ణయ్య దూరంగా ఉన్న మద్దతు మాత్రం తెలుగుదేశానికే ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశించారు. అయితే క్రిష్ణయ్య తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు. ఇక టిక్కెట్ల పంపిణీ సమయానికి క్రిష్ణయ్య తెలుగుదేశం పార్టీ కి మరింత దూరమయ్యారు. ఆయనతో పాటు ఇతర బీసీ సంఘాల నేతలు కూడా తెలుగుదేశం పార్టీ పట్ల కన్నెర్రజేస్తున్నారు. మహాకూటమి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కూటమిలో పెద్దన్నగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా బీసీలు మండిపడుతున్నారు. బీసీలకు కెటాయించాల్సిన స్దానాలు తక్కువ చేసారని - సీనీయర్ నాయకులకు సైతం టిక్కట్లు ఇవ్వకుండా అవమానించారని బీసీల ఆవేదన. బీసీలను అన్నీ పార్టీలు కూరలో కర్వేపాకుల వాడుకుంటున్నాయని - ఓ నిర్దారణకు వచ్చేసారు. టిక్కెట్ల పంపిణీలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఏకంగా తెలంగాణ బంద్‌ కు పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ఐక్యమత్య సంఘటన జరగలేదని - ఈ ఎన్నికలతో బీసీ కులాలు ఒక్కటవుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శనివారం నాటి బంద్ విజయవంతమైతే ఇటు తెలంగాణలోను - అటు ఆంధ్రప్రదేశ్‌ లోను కూడా బీసీ కులాలు ఒక్కటై తమ డిమాండ్లు సాధించుకుంటారని అంచన. ఇదే జరిగితే బీసీల కారణంగా తొలి దెబ్బ తగిలేది మహాకూటిమికేనని విశ్లేషిస్తున్నారు. శనివారం నాటి బంద్ ప్రభావం బీసీల రాజకీయ పార్టీ ఏర్పాటు వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.