Begin typing your search above and press return to search.

యడ్యూరప్ప కుమారుడికి షాక్ ఇచ్చిన బీజేపీ

By:  Tupaki Desk   |   23 April 2018 1:42 PM GMT
యడ్యూరప్ప కుమారుడికి షాక్ ఇచ్చిన బీజేపీ
X
కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత - మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పకు షాక్ త‌గిలింది. పార్టీ ప‌రంగా ఇది కీలక నిర్ణయం అని చెప్తున్న‌ప్ప‌టికీ... ఆయ‌న‌కు పార్టీ ఇచ్చిన ఆదేశంతోనే ఇలాంటి నిర్ణ‌యం వెలువ‌డింద‌ని తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళితే...కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో మైసూర్ జిల్లాలోని వరుణ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు సిద్దమైన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రకు షాక్ ఇచ్చింది. వరుణ నియోజకవర్గం నుండి విజయేంద్ర పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం నో చెప్పింది. ఈ విషయంపై సోమవారం(ఏప్రిల్-23) మైసూర్ లో విలేకరులతో మాట్లాడిన యడ్యూరప్ప తన కుమారుడికి బదులుగా స్ధానిక నేతలు ఆ స్ధానం నుంచి పోటీ చేస్తారని సృష్టం చేశారు. దీంతో పార్టీ నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

మైసూర్‌ లో జరిగిన పార్టీ బహిరంగ సభలో యడ్యూరప్ప మాట్లాడుతూ తన రెండో కుమారుడు బీవై విజయేంద్ర.. వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ స్థానం నుంచి పార్టీకి చెందిన మరో కార్యకర్త పోటీ చేస్తారని ఆయన తెలిపారు. విజయేంద్రను ఎన్నికల బరిలో తప్పించే విషయంపై పార్టీ హైకమాండ్‌ తో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే వరుణ నియోజకవర్గం నుంచి విజయేంద్ర పోటీ చేయడం లేదని ప్రకటించే సరికి ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీలు ఝులిపించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంధ్ర.. కాంగ్రెస్ పార్టీ తరపున వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మే 12న కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న రెండు నియోజక వర్గాలలో ఒకటైన బాదామి నియోజకవర్గానికి కూడా బీజేపీ ఇప్పటికీ తన అభ్యర్ధిని ప్రకటించలేదు.