Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌లో కొత్త చిచ్చురేపిన మాజీ క్రికెటర్

By:  Tupaki Desk   |   16 July 2018 8:54 AM GMT
కాంగ్రెస్‌లో కొత్త చిచ్చురేపిన మాజీ క్రికెటర్
X

తెలంగాణ‌లో ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ ఓ వైపు ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి అధికారం సాధించుకునేందుకు స‌న్నాహాలు చేస్తుంటే...మ‌రోవైపు పార్టీ నేత‌ల మ‌ధ్య ఉన్న విబేధాలు హ‌స్తం పార్టీని తీవ్రంగా దెబ్బేస్తున్నాయి. ఇప్ప‌టికే సీనియ‌ర్ల ఉన్న విబేధాల‌తో పార్టీ భ‌విష్య‌త్తుపై సందేహాలు నెల‌కొంటుంటే...తాజాగా మాజీ ఎంపీల మ‌ధ్య ర‌చ్చ షురూ అయింది. ఏకంగా పార్టీ కార్యాల‌యం వేదిక‌గా స‌వాల్లు విసురుకునే స్థాయికి అది చేరింది. సికింద్రాబాద్‌ లోక్‌ సభ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ క్రికెటర్ - కాంగ్రెస్‌ నేత అజహారుద్దీన్‌ ప్రకటించడంతో గ్రేటర్‌ కాంగ్రెస్‌ నాయకుల సమావేశం రసాబాసగా మారింది. ప్రకటించడంతో అంజన్‌ కుమార్‌ యాదవ్‌ అనుచురులు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అజహర్‌ కు చేతనైతే హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేయాలని స‌వాల్ విసిరారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి అస‌లు ఏం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొన‌డం గ‌మ‌నార్హం.

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత బోసురాజును రాహుల్ గాంధీ ధూతగా తెలంగాణకు పార్టీ అధిష్టానం పంపించింది. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ హైద‌రాబాద్ స‌మావేశం కూడా ఏర్పాటు చేశారు. రాహుల్ దూత రాక‌ సంద‌ర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బోసురాజుగారికి విశేష అధికారాలు ఉన్నాయని, తెలంగాణలో ఏఐసీసీ సెక్రటరీగా ఉంటూ తనకు అప్పగించిన పార్లమెంటు నియోజక వర్గాల లో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తార‌ని తెలిపారు. హైదరాబాద్ సిటీ కమిటీ కూడా త్వరగా ఏర్పాటు చేయబోతుమ‌న్నారు. అనంత‌రం జ‌రిగిన హైద‌రాబాద్ నగర కాంగ్రెస్ సమావేశం రసాబాసగా సాగింది.సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేస్తానని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజారుద్దీన్ మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. దీనిపై అంజ‌న్ భ‌గ్గుమ‌న్నారు. `అజారుద్దీన్‌ కు శక్తి సామర్ధ్యాలు ఉంటే హైద‌రాబాద్ పార్లమెంటు నుండీ పోటీ చేయాలి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అంజన్ పార్లమెంటును వదలడు. కుట్ర‌ల‌ను ఎదుర్కుంటాడు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తాడు` అని అంజన్ కుమార్ ఆవేశంగా మాట్లాడారు.

అంజ‌న్‌ కుమార్ యాద‌వ్‌ కు అనుకూలంగా - అజారుద్దీన్‌ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తున్నవారికి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సర్ధిచెప్పారు. అయితే, ఇదే స‌మావేశానికి హాజ‌రైన మాజీ కేంద్ర‌మంత్రి - మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ సికింద్రాబాద్‌ సీటు అంజన్‌ కుమార్‌ యాదవ్‌ దేనని వ్యాఖ్యానించడం గమనార్హం. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి ఉండ‌గా...స‌ర్వే ఈ హామీ ఇవ్వ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. మ‌రోవైపు, గ్రేట‌ర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతుంటే మాజీ ఎంపీ వి .హనుమంతరావు మీటింగ్‌ లో నుండి వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలాఉండంగా...నగర కాంగ్రెస్ మీటింగ్‌ కు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ - ఆయ‌న త‌న‌యుడు విక్రమ్ గౌడ్ హాజరు కాలేదు.