Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు అజారుద్దీన్ గుడ్ బై..

By:  Tupaki Desk   |   1 Jan 2019 6:10 AM GMT
కాంగ్రెస్ కు అజారుద్దీన్ గుడ్ బై..
X
మైనార్టీ ఓటు బ్యాంకు లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ భారీ వల వేసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎంపీ.. ప్రఖ్యాత భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను టీఆర్ఎస్ లోకి లాగడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి పంపించి తనను అవమానించారని అజారుద్దీన్ కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్నారట.. ఆ అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

టీఆర్ఎస్ సెక్యులర్ ప్రభుత్వంగా ముందుకెళ్తోంది. కానీ టీఆర్ఎస్ లో సీనియర్ ముస్లిం నాయకుల కొరత వేధిస్తోంది. అందుకే రెండోసారి కూడా ఎమ్మెల్యేగా కూడా గెలవలేని మహమూద్ అలీకి కేసీఆర్ మంత్రివర్గంలో తీసుకొని ఏకంగా హోంమంత్రి పదవిని కట్టబెట్టారు. అందుకే ఆలోటును భర్తీ చేసుకోవడానికి.. హైదరాబాద్ ముస్లిం మైనార్టీల్లో విశేష పేరు, ప్రఖ్యాతలున్న అజారుద్దీన్ ను టీఆర్ఎస్ లో కలుపుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయించాలని భావిస్తోంది.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయాక ఇక అజారుద్దీన్ ఆ పార్టీలో కొనసాగడానికి ఇష్టపడడం లేదట.. ఈ మేరకు కేసీఆర్ తో భేటి కావడానికి ప్రయత్నాలు కూడా ప్రారంభించారట. దీనికి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. రేపోమాపో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అజారుద్దీన్ ను టీఆర్ఎస్ లో చేర్చుకోవాలని గులాబీ బాస్ భావిస్తున్నారట..మైనార్టీ ఓటు బ్యాంకు లక్ష్యంగా కేసీఆర్ ఈ ఎత్తు వేస్తుంటే.. కాంగ్రెస్ లో తనకు అవమానాలు అవకాశాలు లేక అజారుద్దీన్ పార్టీ మారుతున్నారు.

కాగా అజారుద్దీన్ కు మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. భారత క్రికెట్ కు మచ్చ తెచ్చారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయనకు లైఫ్ ఇచ్చింది. ఎంపీ పదవి ఇచ్చి గౌరవమిచ్చింది. అంతేకాదు. అజారుద్దీన్ మీద ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసును కూడా కాంగ్రెస్ నీరు గార్చిందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వీక్ అయిపోవడంతో అజారుద్దీన్ తన దారి తాను చూసుకుంటున్నారని తెలుస్తోంది.