Begin typing your search above and press return to search.

అంజ‌న్ స‌వాల్‌ కు అజ్జూ ప్ర‌తిస‌వాల్..!

By:  Tupaki Desk   |   18 July 2018 4:34 AM GMT
అంజ‌న్ స‌వాల్‌ కు అజ్జూ ప్ర‌తిస‌వాల్..!
X
ఊహించ‌ని విధంగా పెద‌వి విప్పి రాజ‌కీయ సంచ‌ల‌నానికి కార‌ణ‌మైన మాజీ క్రికెట‌ర్ అజ‌హ‌రుద్దీన్.. తాజాగా మ‌రోసారి పెద‌వి విప్పి సంచ‌ల‌నం సృష్టించారు. తాను సికింద్రాబాద్ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పిన అజ్జూ.. పార్టీ ఓకే చెబితే తాను బ‌రిలో నిలుస్తాన‌ని చెప్పారు. అజ‌హ‌రుద్దీన్ వ్యాఖ్య‌లు హైద‌రాబాద్ కాంగ్రెస్ లో కొత్త అల‌జ‌డిని రేపాయి.

అజ‌హ‌రుద్దీన్ కు ద‌మ్ముంటే హైద‌రాబాద్ లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేయాలంటూ మాజీ మంత్రి క‌మ్ మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్ యాద‌వ్ స‌వాలు విసిరారు. అజ్జూ నిర్ణ‌యంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ అజ‌హ‌రుద్దీన్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానంటే ఒప్పుకోర‌న్నారు.

ఇదిలా ఉంటే.. ఈ అంశంపై అజ‌హ‌రుద్దీన్ తాజాగా మ‌రోసారి స్పందించారు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంజ‌న్ కుమార్‌కు ద‌మ్ముంటే హైద‌రాబాద్ స్థానం నుంచి పోటీ చేసి.. మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీని ఓడించాల‌న్నారు. త‌న‌పై ఏ రీతిలో అయితే అంజ‌న్ స‌వాల్‌ విసిరారో.. అదే స‌వాల్‌ను తిరిగి అంజ‌న్ మీద అజ‌హ‌రుద్దీన్ ప్ర‌యోగించ‌టం గ‌మనార్హం.

ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌యం ఏమిటంటే.. సికింద్రాబాద్ నుంచి గ‌డిచిన మూడు ద‌ఫాలుగా బ‌రిలోకి దిగిన అంజ‌న్ గ‌డిచిన 30 ఏళ్లుగా హైద‌రాబాద్ ఎంపీ స్థానం ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గంలో నివాసం ఉంటుండ‌గా.. తాజాగా సికింద్రాబాద్ బరిలో దిగేందుకు ఆస‌క్తి చూపిస్తున్న అజ‌హ‌రుద్దీన్ శాశ్వ‌త నివాసం సికింద్రాబాద్‌లో ఉంది. అయితే.. అజ్జూను హైద‌రాబాద్ లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేయాల‌ని అంజ‌న్ కోరుతున్నారు. తాజాగా అజ‌హ‌రుద్దీన్ స‌వాల్ తో వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్క‌ట‌మే కాదు.. మాట‌ల యుద్ధానికి తెర తీసే అవ‌కాశం ఉందంటున్నారు.