అజంఖాన్ ది రచ్చ!... జయప్రద అంతకుమించి!

Mon Apr 22 2019 21:42:15 GMT+0530 (IST)

2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు చేసిన కామెంట్లలో ఏపీవే ఇప్పటిదాకా ఘాటు అనుకుంటే... ఈ విషయంలో ఎప్పుడూ ముందుండే ఉత్తరప్రదేశ్... ఏపీ నేతల కామెంట్లను మరిపించేసిందనే చెప్పాలి. యూపీ నేతల వ్యాఖ్యలు ఎప్పుడూ వివాదాస్పదమే. అందులో ఎలాంటి సందేహం లేకున్నా... ఇప్పుడు ఆ వ్యాఖ్యల ఘాటు మరింతగా ఎక్కువైందని చెప్పాలి. ఈ ఘాటులో సెక్సీ కామెంట్లు కూడా వచ్చి పడుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీ నేత అజంఖాన్... ఒకప్పుడు తమ పార్టీలోనే ఉండి ఇప్పుడు బీజేపీలో చేరిపోయిన ప్రముఖ సినీ నటి జయప్రదపై నోరు పారేసుకున్న తీరు నిజంగానే పెను సంచలనంగా మారిపోయింది.అజం కామెంట్లతో జయప్రద ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం కాక మానదు. అయితే ఇప్పుడు జయప్రద వంతు వచ్చినట్టుంది. అజంఖాన్ నే టార్గెట్ చేసిన జయప్రద... ఈ వివాదంలోకి బహుజన సమాజ్ పార్టీ అధినేత్రిని కూడా లాగేసి పెను సంచలనమే రేపారు. తనపై అజం ఖాన్ చేసిన వ్యాఖ్యలను మరిపించేలా జయప్రద చేసిన సెక్సీ కామెంట్లు ఇప్పుడు తెగ వైరల్ అయిపోయాయి. అయినా జయప్రద ఏమన్నారన్న విషయానికి వస్తే... *మాయవతి జీ.. ఆజాంఖాన్ ను కనిపెట్టుకుని ఉండండి.. ఆయన చూపులు మీ మీద ఎక్కడెక్కడ పడుతున్నాయో చూసుకోండి* అంటూ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు.

అజం ఖాన్ తాను చేరిన పార్టీతో తన వైఖరిని అతికించేసినట్లుగా జయప్రద ఖాకీ నిక్కరు వేసుకున్నారని వ్యాఖ్యానించగా.... ఇప్పుడు అజం ఖాన్ బుద్ది ఎలాంటిదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ... మాయావతిని అలర్ట్ చేస్తున్నట్లుగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరి జయప్రదపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై మూడు రోజుల ప్రచారంపై నిషేదాన్ని విధించిన ఎన్నికల సంఘం... ఇప్పుడు జయప్రద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న వాదన ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తంగా సెక్సీ వ్యాఖ్యల్లో తనకు సాటి రాగల వారెవరూ లేరన్న కోణంలో అజం ఖాన్ వ్యవహరిస్తే... ఆయనను బీట్ చేసేలా ఇప్పుడు జయప్రద కూడా తనదైన శైలి వ్యాఖ్యలు గుప్పించి సంచలనం రేపారు.  తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల తీరునే మాయవతిని కూడా ఆజాంఖాన్ లక్ష్యంగా చేసుకుని మాట్లాడవచ్చంటూ జయప్రద వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో!