Begin typing your search above and press return to search.

అధికారంలో ఉంటే అలానే మాట్లాడతారు

By:  Tupaki Desk   |   6 Oct 2015 4:32 PM GMT
అధికారంలో ఉంటే అలానే మాట్లాడతారు
X
అధికారం చేతికి వస్తే చాలు.. అంతులేని ఆత్మవిశ్వాసం వచ్చేస్తుంది. విపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు.. పవర్ చేతికి వచ్చిన తర్వాత చెప్పే మాటలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. అధికారం లేనప్పుడు భూసేకరణ పెద్ద భూతంలా కనిపించే విపక్షానికి.. అధికారం చేతిలో ఉంటే మాత్రం అభివృద్దికి కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది.

ఓపక్క ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ అంశం ఎంతలా రచ్చ చేసిందో తెలిసిందే. భూసేకరణ విషయంలో వెల్లువెత్తిన వ్యతిరేకత.. పవర్ కల్యాణ్ ఎంట్రీ లాంటి వాటితో వెనక్కి తగ్గటం తెలిసిందే. రాజధాని భూసేకరణ ఎపిసోడ్ తో అయినా కాస్త ఆలోచించాల్సిన ఏపీ సర్కారు అందుకు భిన్నంగా పలు ప్రాజెక్టులకు సంబంధించి భారీ ఎత్తున భూసేకరణను చేపట్టాలని చూడటం విమర్శలకు అవకాశం ఇస్తోంది.

విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి భారీగా భూమిని సేకరించాలన్న ప్రయత్నంలో బాబు సర్కారు ఉంటే.. దాన్ని అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తిని గుర్తించిన ఏపీ విపక్షం అక్కడి వారికి సాంత్వన కలిగేలా మాట్లాడటం మొదలు పెట్టింది. దీంతో అధికారపక్ష నేతలు జాగ్రత్తపడుతూ.. తాము తీసుకున్న నిర్ణయానికి సంబంధించి చెబుతున్న భాష్యం వింటే నవ్వు రాక మానదు.

భోగాపురంలో ఎయిర్ పోర్ట్ కోసం వేలాది ఎకరాల భూసేకరణ నిర్ణయాన్ని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు సమర్థించుకున్న తీరు చూస్తే.. పవర్ మహిమ అనిపించక మానదు. అవగాహన లోపం.. అభివృద్ధికి అడ్డుపడటంతో పాటు.. ముందుచూపు లేని కారణంగా కొందరు నేతలు ఎయిర్ పోర్టులను అడ్డుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

ఎంతో ముందుచూపుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలు తీసు కుంటుంటే.. ఆయన విధానాల్ని విపక్ష నేత అర్థం చేసుకోలేకపోతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి మీద అవగాహన లేని నేతలే ఎయిర్ పోర్ట్ లను అడ్డుకుంటున్నారంటూ తేల్చేశారు. ఎయిర్ పోర్ట్ లతో మార్పు వచ్చేది నిజమే అయినా.. అందుకోసం వేలాది ఎకరాల భూసేకరణ అవసరం లేదన్న విషయాన్ని అయ్యన్న పాత్రుడు ఎందుకు మర్చిపోతున్నట్లు..?