Begin typing your search above and press return to search.

విమాన‌శ్ర‌యంలో కుప్ప‌కూలిన రచ‌యిత్రి

By:  Tupaki Desk   |   26 Feb 2017 5:03 AM GMT
విమాన‌శ్ర‌యంలో కుప్ప‌కూలిన రచ‌యిత్రి
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల ప్ర‌కారం ఆ దేశ పోలీసులు త‌మ ప్ర‌తాపం చూపుతున్నారు. సామాన్యులు మొద‌లుకొని ప్ర‌ముఖ‌ల వ‌ర‌కు అంతా ఇదే రీతిలో గంద‌ర‌గోళం చెందుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత బాల సాహిత్య రచయిత్రి మెమ్‌ ఫాక్స్ తీవ్ర ఆవేద‌న‌తో త‌న‌కు జ‌రిగిన ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితిని పంచుకున్నారు. "లాస్‌ ఏంజెల్స్‌ విమానాశ్రయంలో అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు నిర్బంధించినప్పుడు నేను కుప్పకూలిపోయాను - పసిపాపలా ఏడ్చాను” అని ఫాక్స్‌ తెలిపారు. ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ఒక సదస్సులో పాల్గొనడానికి మిల్వాకేకి ఆమె ప్రయాణిస్తున్నారు. లాస్‌ ఏంజెల్స్‌ విమానాశ్రయంలో ఆమెను కస్టమ్స్‌ అధికారులు ఆపి, దాదాపు రెండుగంటలసేపు ప్రశ్నించారు. ఇప్పటివరకూ ఇలా తనను ఎవరూ ఇంత నీచంగా ఎవరూ చూడలేదని డెబ్భయ్యేళ్ళ ఫాక్స్‌ వాపోయారు.

ఇమ్మిగ్రేషన్లపై డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ అధికారులకు అడ్డూఅదుపూలేని అధికారాలు కట్టబెట్టినట్టు కనిపిస్తోందని ఆమె అన్నారు. "ఒక గదిలో నన్ను ఉంచారు - తప్పుడు వీసా మీద వస్తున్నావంటూ ఆరోపణలు చేశారు. ఆ స‌మ‌యంలో ఖైదీగా ఉన్నట్టనిపించింది. నన్ను శారీరకంగా బాధించినట్టు అనిపించింది. నా వయసు డెబ్భయ్యేళ్ళు. తట్టుకోలేకపోయాను. హొటల్‌ గదిలోకి వెళ్ళగానే పూర్తిగా కుప్పకూలిపోయాను, పసిబిడ్డలా ఏడ్చాను” అని తెలిపారు. గత ముప్ఫయ్యేళ్ళుగా అమెరికాకు వందసార్లకు పైగా ప్రయాణించానని ఆమె తెలిపారు. తనను ఉంచిన గదిలోనే ఎనభయ్యేళ్ళ వయసున్న - వీల్‌ ఛైర్‌ కే పరిమితమైన ఇరానీ మహిళ కూడా ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై వాషింగ్టన్‌ లోని ఆస్ట్రేలియా రాయబార కార్యాలయంలో - కన్‌ బెర్రాలోని అమెరికన్‌ ఏంబసీలో ఆమె ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు అమెరికన్‌ అధికారులనుంచి క్షమాపణలతో లేఖ అందింది. జరిగిన ఘటనకు చింతిస్తున్నామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై మెమ్‌ ఫాక్స్‌ స్పందిస్తూ తనకు ఎదురైన చేదు అనుభవం అనంతరం అమెరికాకి మళ్లీ వెళ్ళే ఉద్దేశం లేనేలేదని స్పష్టం చేశారు.

ఇదిలాఉండ‌గా... ఉన్నత చదువులకోసం, మెరుగైన ఉద్యోగావకాశాలకోసం అమెరికాను ఆశ్రయించిన వివిధ దేశాల ప్రజలు ఆ దేశ నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాల కారణంగా ఏ ముప్పు ముంచుకొస్తుందోనని క్షణక్షణం బితుకుబితుకుమంటూ బతుకులీడుస్తున్నారు. నెల రోజుల కిందట స్వర్గధామంలా కనిపించిన అగ్రదేశంలో ప్రస్తుతం ఏం జరుగుతుందోననే భయం ఇమ్మిగ్రెంట్స్‌ ను వేధిస్తోంది. అక్రమ వలసదారుల్ని తరిమేస్తామంటూ ట్రంప్‌ హూంకరించిన నేపథ్యంలో పోలీసు - అధికార వర్గాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. హొటళ్ళు - బార్లు - సినిమా థియేటర్లు - షాపింగ్‌ మాల్స్‌… ఆఖరికి పెట్రోలు బంకుల దగ్గర సైతం తమకు ‘అనుమానాస్పదం’గా కనిపించిన విదేశీయులను, ముఖ్యంగా ఆసియన్‌ - ముస్లిం దేశాలకు చెందిన వ్యక్తుల్ని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారు. వీసాలు సరైనవా కావా అని తనిఖీలు చేస్తున్నారు. దురుసుతనం ప్రదర్శించి అవమానిస్తున్నారు. ట్రంప్‌ ఎన్నికతో తమ జీవితాలు దుర్భరమైపోయాయని ఇమ్మిగ్రెంట్స్‌ వాపోతున్నారు. కనిపించినవారిని కనిపించిన చోట సోదాలు చేస్తూ, ప్రశ్నలు వేస్తూండడంతో ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందోనని ఇమ్మిగ్రెంట్స్‌ హడలిపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/