Begin typing your search above and press return to search.

ఫారిన్ వెళ్లేవారికి మోడీ స‌ర్కారు శుభ‌వార్త‌

By:  Tupaki Desk   |   19 Jun 2017 2:33 PM GMT
ఫారిన్ వెళ్లేవారికి మోడీ స‌ర్కారు శుభ‌వార్త‌
X
విదేశాల‌కు వెళ్లే భార‌తీయుల‌కు మోడీ స‌ర్కారు ఒక శుభ‌వార్త‌ను అందించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా ఆదేశాల ప్ర‌కారం.. విదేశాల‌కు వెళ్లే భార‌తీయులు డిపార్చ‌ర్ కార్డులు నింపాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. ఇప్ప‌టివ‌ర‌కూ విదేశాల‌కు వెళ్లే వారంతా తాము ఎక్క‌డికి వెళుతున్నామో వివ‌రాలు వెల్ల‌డించ‌టంతో పాటు.. పేరు.. పుట్టిన‌తేదీ.. పాస్ పోర్ట్ నెంబ‌రు.. భార‌త్ లో వారి చిరునామా.. విమాన నెంబ‌రు.. బోర్డింగ్ తేదీ వివ‌రాల్ని త‌ప్ప‌నిస‌రిగా పేర్కొనాల్సి ఉండేది.

ఇక‌పై.. అలాంటివేమీ ఉండ‌దు. అయితే.. ఈ మిన‌హాయింపు మొత్తం విమానాల్లో వెళ్లే వారికి మాత్ర‌మే. రైల్లోనూ.. నౌక‌ల్లో వెళ్లే వారు మాత్రం పాత ప‌ద్ధ‌తినే అనుస‌రించాల్సి ఉంటుంది. రానున్న జులై 1 నుంచి ఈ కొత్త విధానాన్ని అమ‌లు చేయ‌నున్నట్లుగా చెప్పారు.

ఇప్ప‌టివ‌ర‌కూ అమ‌లు చేసిన విధానంలో డిపార్చ‌ర్ కార్డులు త‌ప్ప‌నిస‌రిగా నింపాల్సి ఉండేది. ఇప్పుడు ఆ అవ‌స‌రం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా వెళ్లే భార‌తీయుల‌కు అక్క‌డి ప్ర‌భుత్వం కొత్త వీసా విధానాన్ని తీసుకొచ్చింది. జులై ఒక‌టినుంచి ఆస్ట్రేలియా చూసి రావాల‌నుకునే వారు త‌మ వీసా ద‌ర‌ఖాస్తుల్ని ఆన్ లైన్లో అప్లై చేస్తే స‌రిపోతుంది. ఈ విధానంతో ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ మ‌రింత సుల‌భం అవుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. భార‌త్ లో ఆస్ట్రేలియా వీసాల‌కు భారీగా డిమాండ్ పెరుగుతున్న‌ట్లుగా ఇమ్మిగ్రేష‌న్ అండ్ బోర్డ‌ర్ ప్రొట‌క్ష‌న్ ఆస్ట్రేలియా అసిస్టెంట్ మినిస్ట‌ర్ అలెక్స్ హాక్ వెల్ల‌డించారు.

ఈ ఏడాది మొద‌టి నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలోనే 65 వేల వీసాల్ని ఆస్ట్రేలియా జారీ చేసింద‌న్నారు. తాజా విధానంతో ఆస్ట్రేలియా సంద‌ర్శించాల‌నుకునే భార‌తీయ ప‌ర్యాట‌కుల‌కు.. వ్యాపార‌వేత్త‌ల‌కు సులభంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఆన్‌ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న దాని స్టేట‌స్‌ ను చూసుకోవ‌టానికి వీలు ఉంటుంద‌ని.. వీసాను వెంట‌నే ఆమోదిస్తామ‌ని చెప్పారు. సో.. ఆస్ట్రేలియా కు వెళ్లాల‌నుకునే వారికి ఇక‌పై మ‌రింత హ్యాపీ అన్న‌మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/