మోడీజీ.. వంద తలలు తీసుకురావాల్సిందే!

Mon Jun 18 2018 09:47:28 GMT+0530 (IST)

రంజాన్ పండగ కోసం ఇంటికి బయలుదేరిన రాష్ట్రీయ రైఫిల్ సైనికుడు ఔరంగజేబ్ ను కిడ్నాప్ చేసి.. అతి కిరాతకంగా హత్య చేసిన వైనంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉగ్రవాదులకు సంబంధించిన పెద్ద తలకాయల్ని ఏరివేయటంలో మొనగాడైన ఔరంగజేబ్ సాహసాల గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి వీర జవాన్ ను అన్యాయంగా హత్య చేయటంపై దేశ ప్రజలు మండిపడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఔరంగజేబ్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. వీర జవాను సోదరుడైతే ఏకంగా  ప్రధానికి భారీ విన్నపాన్ని చేశారు. ప్రధాని మోడీజీ.. మా తమ్ముడు ఔరంగజేబ్ ను చంపిన ఉగ్రవాదులపై మీరు బదులు తీర్చుకుంటారా?  లేదా?  మమ్మల్ని తీర్చుకోమంటారా?  మా అన్న మరణానికి వంద ఉగ్రవాదుల తలలు తీసుకురావాల్సిందే.. మీరు ఆ పని చేయలేకపోతే మేమే ఆ పని చేస్తాం సర్.. అంటూ సూటిగా చెప్పేశారు.

తన సోదరుడ్ని హతమార్చేందుకు ఉగ్రవాదులు ఉపయోగించిన కారును నడిపిన డ్రైవర్ ఫోటో.. అతని వివరాలు సోమవారం సాయంత్రం లోపు విడుదల చేయాలని అల్టిమేటం జారీ చేశారు. అప్పటిలోపు వివరాలు అందించకపోతే తానేం చేయాలో నిర్ణయించుకుంటానని ఔరంగజేబ్ సోదరుడు చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వీర జవాను సోదరుడు మాత్రమే కాదు.. ఆయన తండ్రి కూడా కేంద్ర సర్కారుకు 72 గంటల సమయాన్ని ఇచ్చారు. తన కుమారుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.

ఔరంగజేబ్ మరణంతో ఆయన కుటుంబం రంజాన్ జరపుకోలేదు. అంతేకాదు.. గ్రామం మొత్తం వీర జవాను మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వీర జవాను మరణానికి వంద మంది ఉగ్రవాదుల మరణించాలంటూ ఔరంగజేబ్ కుటుంబం చేస్తున్న డిమాండ్ పై పెద్ద ఎత్తున సానుకూలత వ్యక్తమవుతోంది. మరి.. దీనిపై ప్రధాని స్పందిస్తారా?