Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ లో ఆర‌డుగుల బుల్లెట్ పై దాడి!

By:  Tupaki Desk   |   18 Jun 2018 4:14 AM GMT
హైద‌రాబాద్‌ లో ఆర‌డుగుల బుల్లెట్ పై దాడి!
X
విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీలో స‌మైక్యాంధ్ర‌కు అనుకూలంగా ఉద్య‌మం న‌డిపిన వారిలో సో స్పెష‌ల్ గా నిల‌వ‌ట‌మే కాదు.. అర‌డ‌గుల బుల్లెట్ గా స్పెష‌ల్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు ఎపీ ఎన్జీవో నాయకుడు అశోక్ బాబు. అలాంటి ఆయ‌న‌కు అనుకోని ప‌రిణామాలు హైద‌రాబాద్‌ లో ఏర్ప‌డ్డాయి. ఆయ‌న‌పైనా.. ఆయ‌న వ‌ర్గానికి చెందిన వారిపైనా భౌతిక దాడి జ‌ర‌గ‌టం సంచ‌ల‌నంగా మారింది. మీడియాలో అండ‌ర్ ప్లే అయిన ఈ వార్త వాస్త‌వంలో జ‌రిగింది జ‌రిగిన‌ట్లుగా బ‌య‌ట‌కు వ‌స్తే లేనిపోని ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకునే వీలుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌స్తుతానికి బాధితుడిగా మారిన అర‌డ‌గుల బుల్లెట్ అశోక్ బాబు.. త‌న‌పై జ‌రిగిన దాడి గురించి ఓపెన్ గా మాట్లాడ‌లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. మీపైన దాడి జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు.. ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌ని ప్ర‌శ్నిస్తే.. దాడి కాదండి.. దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించారు.. ప్లాన్ ప్ర‌కారం దౌర్జ‌న్యం చేశారంటూ చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో అబిడ్స్ పోలీస్ స్టేష‌న్లో ఇచ్చిన కంప్లైంట్ లో మాత్రం త‌మపైన ప‌థ‌కం ప్ర‌కారం దాడి చేశార‌ని.. కింద‌ప‌డేసి పిడిగుద్దులు గుద్దిన‌ట్లుగా ఎపీఎన్టీవో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి పేర్కొన‌టం గ‌మ‌నార్హం.

తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణ‌మైన ఈ ఉదంతంలో అస‌లేం జ‌రిగింద‌న్న‌ది చూస్తే..

గ‌చ్చిబౌలి మ్యూచువ‌ల్లీ ఎయిడెడ్ కో ఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ క‌మిటీ స‌మావేశం ఆదివారం గ‌న్ ఫౌండ్రీలోని ఎపీ ఎన్జీవో హోంలో జ‌రిగింది. అయితే.. ఈ స‌మావేశానికి సంబంధించిన వివ‌రాల్ని గుట్టుగా ఉంచారు. త‌మ స‌భ్యుల‌కు మెసేజ్ ల రూపంలో పంపారు. ఈ విష‌యాన్ని భాగ్య‌న‌గ‌ర్ తెలంగాణ ఎన్జీవో నేత‌లు.. ఉద్యోగులు.. రిటైర్డ్ ఉద్యోగులు తెలుసుకొని స‌మావేశం జ‌రుగుతున్న చోటుకు వ‌చ్చారు.

త‌లుపులు మూసుకొని నిర్వ‌హించుకుంటున్న వైనంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ప‌లువురు ఎపీ ఎన్జీవో భ‌వ‌నం త‌లుపుల్ని బ‌లంగా బాదేశారు. పెద్ద సంఖ్యలో వ‌చ్చిన భాగ్య‌న‌గ‌ర్ తెలంగాణ ఎన్జీవోలు.. వారి పేరిట అక్క‌డ‌కు వ‌చ్చిన వారు సీక్రెట్ గా జ‌రుగుతున్న మీటింగ్ హాల్లోకి వెళ్లారు. త‌లుపులు మూసుకొని మ‌రీ మీటింగ్ లు పెట్టుకోవ‌టం ఏమిటంటూ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

ఈ స‌మ‌యంలో మాట్లాడుతున్న అశోక్ బాబుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఇంటి స్థ‌లాల వ్య‌వ‌హారంలో అన్యాయంగా వ్య‌వ‌హ‌రించార‌ని.. కోర్టుకు వెళ్లి మోసం చేశార‌ని.. కోట్లు తినేశారంటూ తిట్ల దండ‌కం అందుకున్నారు. మ‌రోవైపు మాట్లాడుతున్న అశోక్ బాబు చుట్టూ చేరిన వారు.. ఆయ‌న‌పైనా.. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిల‌పై భౌతిక‌దాడికి దిగారు. కింద‌ప‌డేసి పిడిగుద్దులు గుద్దిన‌ట్లుగా ఏపీ ఎన్జీవోలు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంత‌రం వారు భ‌వ‌నంలోని మ‌రో గ‌దిలో స‌మావేశం పెట్టుకోగా.. గ‌దిలోకి ప్ర‌వేశించిదాడికి పాల్ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణ‌మైన ఈ ఉదంతం గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకొని ఇరువ‌ర్గాల వారిని స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేశారు. ఇదిలా ఉంటే.. ఎపీ ఎన్జీవో నేత‌లే త‌మ‌పై భౌతిక దాడుల‌కు దిగార‌ని.. కోస్తా.. రాయ‌ల‌సీమ‌కు చెందిన కిరాయి వ్య‌క్తుల్ని తీసుకొచ్చి త‌మ‌పై దాడికి పాల్ప‌డిన‌ట్లుగా ఆరోపిస్తున్నారు.ఈ వ్య‌వ‌హారంలో ఏపీ ఎన్జీవో సంఘం భ‌వ‌నంలోని ఫ‌ర్నీచ‌ర్.. పూల‌కుండీలు.. అద్దాలు ధ్వంస‌మ‌య్యాయి.

ఇదిలా ఉంటే.. అశోక్ బాబు త‌దిత‌రుల‌పై జ‌రిగిన దాడికి త‌మ‌కు సంబంధం లేద‌ని భాగ్య‌న‌గ‌ర్ తెలంగాణ ఎన్జీవో సంఘానికి చెందిన నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. త‌మ సంఘానికి సంబంధం లేని వారెవ‌రూ వ‌చ్చినట్లుగా బీటీఎన్జీవో అధ్య‌క్షులు స‌త్య‌నారాయ‌ణ గౌడ్ ఆరోపిస్తున్నారు. గ‌త నాలుగేళ్లుగా నిర్వ‌హించ‌ని ఎపీఎన్జీవో హౌసింగ్ సొసైటీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశాన్ని ర‌హ‌స్యంగా నిర్వ‌హించుకోవాల్సిన అవ‌స‌రం ఏమిటంటూ ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తంగా హౌసింగ్ స్థ‌లాల పంచాయితీ విష‌యం అశోక్ బాబు అండ్ కోల‌కు చేదు అనుభ‌వాన్ని మిగిల్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.