Begin typing your search above and press return to search.

త‌వ్వితే ఎలుక కాదు.. చీమ‌.. దోమ కూడా ప‌ట్టుకోలేర‌ట‌!

By:  Tupaki Desk   |   24 Jun 2019 4:52 AM GMT
త‌వ్వితే ఎలుక కాదు.. చీమ‌.. దోమ కూడా ప‌ట్టుకోలేర‌ట‌!
X
గ‌త ప్ర‌భుత్వం పాల‌న గురించి ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలిసినంత బాగా మ‌రెవరికి తెలీదు. ఈ కార‌ణంతోనే ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో చారిత్ర‌క తీర్పును ఇచ్చారు. ప్ర‌భుత్వంలోని అవినీతిని పెకిలించివేయాల‌న్న ధృడ సంక‌ల్పంతో ఉన్న జ‌గ‌న్‌.. వివిధ ప‌థ‌కాల్లో దొర్లిన అవినీతి.. అక్ర‌మాల మీద దృష్టి పెట్టారు. ఇదే విష‌యాన్ని తాజాగా మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు.

గుమ్మ‌డికాయ‌ల దొంగ ఎవ‌రంటే భుజాలు త‌డుముకున్న చందంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. అవినీతి కొండ‌ను త‌వ్వుతామ‌న్న జ‌గ‌న్ మాట‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చే క్ర‌మంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చూస్తే..

అక్క‌డేదో కొండ ఉంది.. తవ్వుతానంటున్నావు.. త‌వ్వితే ఎలుక కాదు క‌దా.. చీమ‌.. దోమను కూడా ప‌ట్టుకోలేవ‌న్న అచ్చెన్న‌.. మీ ఇష్టం.. త‌వ్వుకుంటే త‌వ్వుకోండి.. ఎక్క‌డి నుంచి త‌వ్వుతారో అక్క‌డ నుంచి త‌వ్వండి.. ఎంత లోతున త‌వ్వుతారో అంత లోతున త‌వ్వండ‌న్నారు. గ‌తంలో జ‌గ‌న్ కేబినెట్ లో ఉన్న మంత్రులు ఏం మాట్లాడారో త‌మ ద‌గ్గ‌ర‌ రికార్డులు ఉన్నాయ‌ని.. ఈ రోజున నీతులు మాట్లాడుతున్న వారు.. గ‌తంలో ఏమేం చేశారో అవ‌న్నీ తాము బ‌య‌ట‌పెడ‌తామ‌న్నారు.

నిజంగా జ‌గ‌న్ కేబినెట్ లో ఉన్న వారు త‌ప్పులు చేసి ఉంటే నిర్బ‌యంగా బ‌య‌ట‌పెట్టాలి అంతే కానీ.. మీరు బ‌య‌ట‌పెడితే మేం బ‌య‌ట‌పెడ‌తామ‌న్న మాట ఎందుకు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ప‌థ‌కాల్లో దొర్లిన అవినీతి నిగ్గు తేలుస్తామ‌న్న‌ప్పుడు.. ఎలాంటి త‌ప్పులు చేయ‌న‌ప్ప‌డు.. ఓకే.. చేసుకోండ‌న్న మాట మాట్లాడాలే కానీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌. కొండ‌ను త‌వ్వితే ఎలుక కాదు క‌దా.. చీమ‌.. దోమ దొర‌క‌ద‌న్న అచ్చెన్న మాట‌లు వినేందుకు బాగానే ఉన్నా.. ఈ వ్య‌వ‌హారంపై లెక్క తేలేంత వ‌ర‌కూ ఇదే మాట మీద ఆయ‌న‌ ఉంటారా? అన్న‌ది ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం త్వ‌ర‌లోనే తేలిపోనుంది.