Begin typing your search above and press return to search.

దటీజ్ వాజ్‌ పేయ్

By:  Tupaki Desk   |   16 Aug 2018 5:37 PM GMT
దటీజ్ వాజ్‌ పేయ్
X
దేశ రాజకీయాలలో అటల్ బిహారి వాజ్‌ పేయిది విశిష్టమైన వ్యక్తిత్వం. అంతే కాదు దేశ రాజకీయాలలో ఆయన ముద్ర చెరగరానిది. దేశంలో కాంగ్రెస్ పార్టీ నానాటికి దిగజారడాన్ని వాజ్‌ పేయ్ ఉదాహరణతో సహా చెప్పిన తీరు మరువలేనిది. భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్ నెహ్రు ఆనాటి స్పీకర్ విందులో పాల్గొన్న వాజ్‌ పాయ్‌ ని ఉద్దేశించి ఈ యువ పార్లమెంటేరియన్ భావిభారత ప్రధాని అని ప్రకటించారు. ఈ విషయాన్ని వాజ్‌ పేయ్ తాను ప్రధానిగా ఉన్నప్పుడు లోక్‌ సభలో చెప్పారు. అంత గొప్ప పార్టీ నేడు ఎలా మారిందో కూడా ఆ సభలో వివరించారు. నెహ్రు తర్వాత ప్రధాని అయిన ఆయన కుమార్తె ఇందిరా గాంధీ స్పీకర్ తేనేటి విందులో గొప్ప ప్రతిపక్ష నాయకుడు వాజ్‌ పేయ్ అని పరిచయం చేసినట్లుగా ఆయన చెప్పారు. ఆ తర్వాత కొంత కాలానికి రాజీవ్ గాంధీ ప్రధాని అయిన తర్వాత జరిగిన స్పీకర్ తేనేటి విందులో రాజీవ్ తనని పట్టించుకోలేదని, కనీసం పలకరించలేదని ఆయన బాధపడ్డారు. ఇక పి.వి. నరసింహారావు ప్రధాని అయిన తర్వాత స్పీకర్ ఇచ్చిన విందుకు తనకు ఆహ్వానమే అందలేదని వాజ్‌ పేయ్ సభలో ప్రకటించారు. ఇదీ కాంగ్రెస్ పార్టీలో నానాటికి దిగజారుతున్న సంస్క్రతి, సంప్రాదాయమని కాంగ్రెస్ పార్టీని ఎండగట్టారు.

ఎమర్జెన్సీ అనంతరం కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బ తింది. ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ఎన్నికలలో జనతా పార్టీ గెలచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ ప్రభుత్వం ఎన్నో రోజులు అధికారంలో లేదు. అనంతరం జరిగిన ఎన్నికలలో ఇందిర ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఆ ప్రభంజనంలో వాజ్‌ పేయ్ కూడా ఓడిపోయారు. దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళం నియోజకవర్గం - మరో రాష్ట్రంలోని ఇంకో నియోజకవర్గం లోనూ ఎన్నికలు జరగలేదు. అక్కడి అభ్యర్ధుల మరణంతో ఎన్నిక వాయిదా పడింది. ఆ సమయంలో ఇందిరా గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లడుతూ వాజ్‌ పేయ్ లాంటి నాయకుడు లేని లోక్‌ సభను తాను ఊహించలేనని, ఆయన అంగీకరిస్తే ఎన్నికలు జరగని రెండు నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి వాజ్‌ పేయ్‌ ని పోటీ లేకుండా లోక్‌ సభ సభ్యుడిని చేస్తామని ప్రకటించారు. అయితే ఇందిర ఇచ్చిన ఈ ఆహ్వానాన్ని అటల్‌ జీ సున్నితంగా తిరస్కరించారు. తన పట్ల సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకతవచ్చిందని, అలాంటిది తనకు సంబంధం లేని నియోజకవర్గం నుంచి లోక్‌ సభకు ఎలా వెళాతానంటూ ప్రశ్నించారు. ఇదీ అటల్ బిహారి వాజ్‌ పేయ్ అంటే.