Begin typing your search above and press return to search.

చంద్రబాబుతో జాగ్రత్త...

By:  Tupaki Desk   |   17 Aug 2018 4:15 AM GMT
చంద్రబాబుతో జాగ్రత్త...
X
అటల్ బిహారీ వాజ్‌ పేయి. ప్రపంచం ఎన్నదగిన నాయకుడు. భారతీయ జనతా పార్టీలో సింహంలా గర్జించిన నాయకుడు. తన మాటలతో... కవిత్వంతో... చలోక్తులతో సభికులను ఆశ్చర్యానికి - ఆనందానికి గురి చేసిన వ్యక్తి. అయితే అలాంటి మహోన్నతుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులను హెచ్చరించారట.. అవును... నిజం.. చంద్రబాబు నాయుడి రాజకీయాల ముందు ఎవరైనా ఇబ్బందులు పడక తప్పదని - దీనికి ఆయన మామగారైన ఎన్.టి.రామారావే ప్రత్యక్ష సాక్ష్యం అని వాజ్‌ పైయి ఆంధ్రప్రదేశ్ నాయకులను హెచ్చరించారని స్ధానికి బిజెపి నాయకులు చెబుతున్నారు. అది తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులు ఉబలాటపడిన సమయమట.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిర్చే పనిని రాష్ట్రానికి చెందిన బిజెపీ సీనియర్ నాయకుడొకరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట.

అప్పటికే భారతీయ జనతా పార్టీకి - ఎన్.టి.రామారావు సతీమణి - లక్ష్మీపార్వతి తెలుగుదేశం పార్టీకి మధ్య పొత్తు ఉంది. ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల బరిలో దిగాలనుకున్నాయి. సరిగ్గా ఆ సమయంలో చంద్రబాబు నాయుడు చక్రం అడ్డం వేసి బిజెపి - లక్ష్మీ పార్వతి తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తుకు గండి పడేలా చేశారని ఓ అపవాదు అప్పట్లో ప్రచారంలో ఉంది. సరిగ్గా ఆ సమయంలో రాష్ట్ర నాయకులు భారతీయ జనతా పార్టీ సీనియర్లు అయిన అటల్ బిహారీ వాజ్‌ పేయి - లాల్ క్రష్ణ అద్వాణీని కలిసారట. ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీ గురించి - చంద్రబాబు నాయుడితో పొత్తు గురించి ఏపీ బిజెపీ నాయకులు తమ సీనియర్ల వద్ద ప్రస్తావించారట. ఆ సమయంలో వాజ్‌ పేయి కలుగజేసుకుని మీరు అనుకున్నట్లు ఉండదు పొత్తు అంటే. అందులోనూ చంద్రబాబు నాయుడితో స్నేహం అంటే మాటలు కాదు. అన్నీ ఆలోచించుకుని చెప్పండి. ఒక్కసారి ముందుకు వెళ్తే ఇక వెనక్కి వచ్చే అవకాశమే ఉండదు. ఆయన చాణక్య రాజకీయాల ముందు ఎవరూ సరిపోరు అని హెచ్చరించారట. వాజ్‌ పేయి అన్నట్లుగానే చంద్రబాబు నాయుడితో భారతీయ జనతా పార్టీ పొత్తు కొన్నాళ్లు మాత్రమే పొసగింది. ఆ తర్వాత రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేశాయి. మళ్లీ చాలా కాలం తర్వాత నరేంద్ర మోదీ - అమిత్ షాల చొరవతో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. నాలుగేళ్ల తర్వాత ఈ పొత్తు... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ - అమిత్ షా చాణక్యంతో చిత్తు అయ్యింది.