Begin typing your search above and press return to search.

చంద్రుడిపైకి వెళ్తే గుండెపోటేనా...?

By:  Tupaki Desk   |   29 July 2016 7:30 PM GMT
చంద్రుడిపైకి వెళ్తే గుండెపోటేనా...?
X
ఇతర గ్రహాలపైన - చంద్రుడిపైనా మనిషి జీవించడానికి గల అవకాశాలపై శాస్ర్తవేత్తలు ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తున్నారు. చంద్రుడిపైకి వెళ్లొచ్చారు కూడా.. అయితే - తాజా అధ్యయనాల ప్రకారం వెలుగుచూసిన వాస్తవాలు వింటే ఇతర గ్రహాలపై జీవనం అంత ఈజీ కాదని.. మనిషి మరణానికి అది దారితీస్తుందని భావిస్తున్నారు. ఇందుకు ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. చంద్రుడిపై కాలుమోపి మళ్లీ భూమి మీదకు వచ్చినవారే అర్ధాంతరంగా చనిపోతుండడంతో కొత్త సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ ఉదాహరణలు..

- నాసా చేపట్టిన చంద్రయాత్రకు వెళ్లి వచ్చిన రెండు సంవత్సరాల తరువాత వ్యోమగామి జేమ్స్ ఇర్విన్ తన 43 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. చంద్రుడిపై నడిచిన దానికి, ఇర్విన్ మరణానికీ సంబంధం లేదని అప్పట్లో వైద్యులు చెప్పారు కానీ... అయనకు అప్పుడప్పుడూ గుండె కొట్టుకునే వేగంలో మార్పు వచ్చే లక్షణాలున్నాయని, ఆ కారణంగానే గుండెపోటు వచ్చినట్టు తేల్చారు.

- అదే మిషన్ లో చంద్రుడిపై వెళ్లొచ్చిన రాన్ ఈవన్స్ తన 56 ఏళ్ల వయసులో గుండెపోటుతోనే మరణించారు.

- చంద్రుడిపైకి తొలిసారి వెళ్లి చరిత్ర పుటల్లో నిలిచిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కూడా గుండె సమస్యతోనే తన 82వ ఏట 2012లో మృతి చెందారు.

- మొత్తం మీద నాసా ట్రైనింగ్ ఇచ్చి అంతరిక్షంలోకి పంపించిన ఆస్ట్రోనాట్లలో ఇప్పటివరకూ 77 మంది గుండె - రక్తనాళాల సంబంధ సమస్యలతోనే మృతి చెందారు.

అయితే.. ఇప్పటివరకూ కేవలం 24 మంది మాత్రమే భూమి కక్ష్యను దాటి అంతరిక్షంలోకి ప్రయాణాలు సాగించారని మిగతా వారంతా భూ కక్ష్యను దాటకుండా స్పేస్ సెంటర్ కే పరిమితం అయ్యారని నాసా చెబుతోంది. అంతరిక్షలోతుల్లోకి వెళ్లిన వారికి రక్తనాళాలు - గుండెపై ఒత్తిడి పడే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నా దీనిపై సరైన అధ్యయనం చేయాలంటే ఆ వాతావారణంలో మాత్రమే చేయగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. చంద్రుడిపైకి వెళ్లొచ్చినవారంతా గుండెజబ్బులతోనే మరణిస్తుండడంతో ఏదో కారణం లేకుంటే అలా జరగదని అర్థమవుతోంది.