Begin typing your search above and press return to search.

విచార‌ణ ప‌ర్వానికి అంత‌మెన్న‌డో?

By:  Tupaki Desk   |   21 Jan 2017 7:36 AM GMT
విచార‌ణ ప‌ర్వానికి అంత‌మెన్న‌డో?
X
ఏపీ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల్లో భాగంగా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ విప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేలు తెలిపిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై విచార‌ణ ఇప్పుడ‌ప్పుడే పూర్త‌య్యేలా లేదు. ఏపీకా ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని సాక్షాత్తు రాజ్య‌స‌భ‌లో నాటి ప్ర‌ధాని హోదాలో మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌క‌ట‌న చేయ‌గా, బీజేపీ కూడా అందుకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డ‌మే కాకుండా... ఐదేళ్లు కాదు ప‌దేళ్ల పాటు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది. ఈ విష‌యంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స‌ర్కారుపై ఒత్తిడి పెంచ‌డంతో పాటు ప్ర‌త్యేక హోదాను సాధించాల్సి ఉన్నా... అందుకు విరుద్ధంగా కేంద్రం ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీకి సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఒప్పుకున్న వైఖ‌రిపై వైసీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు కేవ‌లం మూడంటే మూడు రోజుల పాటు మాత్ర‌మే జ‌రిగినా... ఆ మూడు రోజుల పాటు కూడా వైసీపీ ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌త్యేక హోదా నినాదాల‌తో స‌భ‌ను హోరెత్తించింది.

ఈ నిర‌స‌న‌ల్లో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు కొంద‌రు చెప్పులేసుకున్న కాళ్ల‌తోనే అసెంబ్లీ సిబ్బంది కూర్చునే బెంచీల‌పైకి ఎక్కారు. ప్ల‌కార్డులు చేత‌బ‌ట్టి స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌ కు నిర‌స‌న తెలిపారు. త‌మ‌ను అడ్డుకున్న మార్ష‌ల్స్‌ తో వాదులాట‌కు దిగారు. వైసీపీ ఎమ్మెల్యేల వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్యక్తం చేసిన అధికార ప‌క్షం... వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పీకర్‌ను కోర‌గా... ఈ విష‌యాన్ని తేల్చాలంటూ స్పీక‌ర్ ప్రివిలేజ్ క‌మిటీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలో స‌భ‌లో జ‌రిగిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల సీడీల‌ను ప‌రిశీలించిన ప్రివిలేజ్ క‌మిటీ... ఈ గొడ‌వ‌కు 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కార‌ణ‌మ‌ని తేల్చింది. వారికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నోటీసుల‌ను గౌర‌వించిన వైసీపీ ఎమ్మెల్యేలు క‌మిటీ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

విడ‌త‌ల‌వారీగా జ‌రిగిన క‌మిటీ విచార‌ణ‌కు దాదాపుగా నోటీసులు అందుకున్న వారంతా హాజ‌ర‌య్యారు. త‌మ వాద‌న‌ను కూడా వినిపించారు. ప్ర‌త్యేక హోదా ప‌ట్ల ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో గూటు క‌ట్టుకున్న భావ‌న‌ను తాము స‌భ ముందు చూపించామ‌ని కూడా చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి లాంటి నేత‌లు తేల్చిచెప్పారు. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వాద‌న‌లు తెలిసిన నేప‌థ్యంలో వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలో? వ‌ద్దో?... నిర్ణ‌యం తీసుకునే హ‌క్కు ప్రివిలేజ్ క‌మిటీకి ఉంది. మ‌రి ఈ విష‌యాన్ని త్వ‌ర‌గా తేల్చేస్తే... నాడు స‌భ‌లో జ‌రిగిన ఆందోళ‌న‌లు ఏ క‌ర‌మైన‌వో తేల్చేయొచ్చ‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే ఆ విష‌యం ఇప్పుడ‌ప్పుడే తేలేలా క‌నిపించడం లేదన్న వాద‌న వినిపిస్తోంది. క‌మిటీ విచార‌ణ ప‌ర్వంలో భాగంగా మ‌రోమారు ఈ నెల 28న విచార‌ణ‌కు రంగం సిద్ధ‌మైంది. ఈ విచార‌ణ‌లోనైనా ఈ వ్య‌వ‌హారానికి ముగింపు ల‌భిస్తుందా? లేదా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/