Begin typing your search above and press return to search.

అసెంబ్లీ సీట్ల పెంపు : గోడ మీద రేపు

By:  Tupaki Desk   |   26 July 2017 6:34 PM GMT
అసెంబ్లీ సీట్ల పెంపు : గోడ మీద రేపు
X
కొన్ని కిరాణా దుకాణాల్లో గోడ మీద ‘‘అప్పు రేపు’’ అనే బోర్డు వేలాడదీసి ఉంటుంది.

గతంలో ‘‘ఓ స్త్రీ రేపురా’’ అంటూ అందరూ ఇళ్ల తలుపుల మీద రాసుకున్న మూఢనమ్మకం ఒకటి వ్యాప్తిలోకి వచ్చింది.

ఆ రకంగా అసలు పూర్తయ్యే అవకాశం లేని పని గురించి ‘గోడ మీద రేపు’ గా అభివర్ణించడం పరిపాటి! ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అనే వ్యవహారం అచ్చం అలాగే తయారవుతున్నది. అది ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు. మొన్నమొన్నటిదాకా చంద్రబాబు నాయుడు తన కోటరీ ద్వారా.. ఇదిగో అదిగో అయిపోతున్నది అంటూ ఊరించారు. కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. రెండు రోజుల కిందటి ఢిల్లీ సమాచారం ప్రకారం అయితే.. సీట్ల పెంపునకు తెలంగాణ భాజపా శాఖ అడ్డం పడుతున్నదని, అందుకే ఏపీ భాజపా కోరుతున్నప్పటికీ కూడా రాజకీయ నిర్ణయం తీసుకోవడంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్నదని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తెలంగాణ గులాబీ పార్టీ కూడా సీట్ల పెంపు డిమాండును గాలికొదిలేసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆరే.. సీట్లు పెరగకపోయినా ఓకే అనేశారు. ఏపీలో చంద్రబాబునాయుడుకు గొంతులో పచ్చి వెలక్కాయ లాంటి మాట ఇది.

చంద్రబాబునాయుడు కేవలం.. సీట్లు పెరుగుతాయి... అనే మాటను ఎరగా ప్రయోగించి.. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి చాలా మంది నాయకులు తన పార్టీలోకి ఫిరాయించేలా చేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఫిరాయించిన చోట.. తెదేపాకు చెందిన ఇన్ ఛార్జిలు అసంతృప్తికి గురైతే.. ఇదే సీట్లపెంపు తాయిలం చూపించి.. వారిని ఊరడించారు. అందుకే ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ.. ఇదిగో అదిగో పెరిగిపోతున్నాయ్ అంటూ మాయ చేస్తున్నారు. కానీ ఇవాళ కేసీఆర్ మాటలతో క్లారిటీ వచ్చినట్లే. ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని అంతా అనుకుంటున్నారు.

దీనివల్ల చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీకి చాలా ఇక్కట్లు ఎదురుకావచ్చు. దాదాపుగా సగానికి పైగా నియోజకవర్గాల్లో పార్టీ అధిష్టానం పట్ల ధిక్కార స్వరాలు పెరుగుతాయి. అసలే ప్రభుత్వం నిర్వహణలోనే బోలెడన్ని తలనొప్పులతో సతమతం అవుతున్న చంద్రబాబుకు, పార్టీలోని చికాకులు.. చల్లారే అవకాశం లేని రావణకాష్టంలా పరిణమించే ప్రమాదం ఉంది. ఈ దుస్థితి నుంచి చంద్రబాబునాయుడు ఈజీగా బయటపడతారనుకోవడం భ్రమే. కాకపోతే.. తన చాణక్య రాజకీయ అనుభవాన్ని రంగరించి.. ఆయన అసంతృప్తులందరినీ ఏ రకంగా ఇంకా ఎంత కాలంపాటూ మభ్యపెట్టగలరో చూడాలి.