Begin typing your search above and press return to search.

విజయసాయిరెడ్డి నామినేషన్ కు ఆ ఇద్దరూ డుమ్మా

By:  Tupaki Desk   |   27 May 2016 4:53 AM GMT
విజయసాయిరెడ్డి నామినేషన్ కు ఆ ఇద్దరూ డుమ్మా
X
పార్టీలో అత్యంత కీలకమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు.. పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటం దేనికి సంకేతం? జగన్ పార్టీలో అధినేత తర్వాత అప్రకటిత నెంబర్ టూగా వ్యవహరిస్తూ.. జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసి.. ఆయన నామినేషన్ ను దాఖలు చేసే కార్యక్రమానికి మించిన ముఖ్యమైన కార్యక్రమం వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇంకేం ఉంటుంది?

ఇంతటి ముఖ్యమైన కార్యక్రమానికి ఇద్దరు జగన్ పార్టీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలా అని వారు రాలేనంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారా? అంటే అలాంటిదేమీ లేదనే చెప్పాలి. విజయసాయిరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి డుమ్మా కొట్టేసిన ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఏం చేశారంటే..తమ నియోజకవర్గంలో పార్టీ అనుచరులతో భేటీలు నిర్వహించారంతే.

పార్టీ అధినేతకు సన్నిహితుడికి సంబంధించిన ముఖ్యమైన వ్యవహారం హైదరాబాద్ లో జరుగుతుంటే.. అందుకు భిన్నంగా తమ నియోజకవర్గాలకే పరిమితమైన కందుకూరు.. గిద్దలూరు ఎమ్మెల్యేల (పోతుల రామారావు.. ముత్తుముల ఆశోక్ రెడ్డి) తీరుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరూ పార్టీని వీడి సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని.. ఇందులో భాగంగానే విజయసాయిరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్లుగా చెబుతున్నారు. చూస్తుంటే.. ఈ ఇద్దరూ జంప్ అయిపోవటానికి ఎక్కువ టైం పట్టదన్న మాట వినిపిస్తోంది.