Begin typing your search above and press return to search.

రేప్‌ కేసు..ఆశారాంకు షాక్‌..అస‌లేం జ‌రిగిందంటే

By:  Tupaki Desk   |   25 April 2018 10:08 AM GMT
రేప్‌ కేసు..ఆశారాంకు షాక్‌..అస‌లేం జ‌రిగిందంటే
X
అత్యాచారాల విష‌యంలో మ‌రో కీల‌క తీర్పు వెలువ‌డింది. పదహారేళ్ల మైన‌ర్‌ అమ్మాయిని రేప్ చేసిన కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును దోషిగా తేల్చుతూ జోధ్‌ పూర్ కోర్టు తీర్పునిచ్చింది. 2013లో జరిగిన రేప్ కేసులో ఇవాళ జోధ్‌ పూర్‌ కు చెందిన ఎస్సీ - ఎస్టీ కోర్టు తుది తీర్పును వెల్లడించింది. మణి గ్రామంలో ఉన్న ఆశ్రమంలో.. ఆశారాం బాపు 16 ఏళ్ల యువతిని రేప్ చేశాడు. ఆ కేసులో 2013 ఆగస్టు 31న అతన్ని అరెస్టు చేశారు. యూపీకి చెందిన షాజహాన్‌ పూర్ గ్రామస్తురాలైన ఆ యువతి చికిత్స కోసం ఆశ్రమానికి వెళ్లింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివ‌ - శిల్పిల‌ను కూడా దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది.మ‌రో ఇద్ద‌రు శ‌ర‌ద్‌ - ప్ర‌కాశ్‌ ల‌ను కోర్టు నిర్దోషుల‌గా ప్ర‌క‌టించింది.

కాగా, తాను దైవానికి మారు రూప‌మ‌ని - త‌న‌కు అన్నీ స‌మ‌ర్పించుకోవాల‌ని ఆశారాం త‌న‌ను మోసం చేశాడ‌ని రేప్‌ కు గురైన బాధితురాలు ఆరోపించారు. ఆశారంను దోషిగా కోర్టు తేల్చింద‌ని, త‌మ‌కు న్యాయం జ‌రిగింద‌ని ఈ సంద‌ర్భంగా బాధితురాలి తండ్రి తెలిపాడు. ఈ పోరాటంలో త‌న‌కు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు ఆయ‌న చెప్పాడు. ఈ కేసులో ఆశారాంకు శిక్ష ఖ‌రారు ఆవుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పాడు. సాక్షుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని భావిస్తున్న‌ట్లు తెలిపాడు. జోధ్‌ పూర్ కోర్టు తీర్పుపై త‌మ న్యాయ నిపుణుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన త‌ర్వాత త‌మ భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని ఆశారాం ఆశ్ర‌మ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు.

ఇదిలాఉండ‌గా... ఆశారాం బాపు ఓ ఆధ్యాత్మిక గురువు. ఆయన అసలు పేరు అసుమల్ హర్పలాని. 1941లో పాకిస్థాన్‌ లోని సింధ్ ప్రాంతంలోని బెర్నాయి గ్రామంలో ఆయన జన్మించాడు. దేశ విభజన తర్వాత ఆశారాం ఫ్యామిలీ గుజరాత్‌ లోని అహ్మాదాబాద్‌ కు వలస వచ్చింది. 60వ దశకంలో ఆయన రకరకాల ఆధ్మాత్మిక గురువుల వద్ద విద్యను అభ్యసించారు. అందులో ఒక గురువు ఆయనకు ఆశారాం అన్న పేరు పెట్టారు. 1972లో ఆశారాం తన ఆశ్రమాన్ని ప్రారంభించారు. గుజరాత్‌ లోని మొతేరా పట్టణంలో ఉన్న సబర్మతి నది తీరంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా తక్కువ సమయంలోనే ఆశారాం పాపులారిటీ దేశవ్యాప్తంగా పెరిగింది. ప్రపంచదేశాల్లోనూ ఆయనకు భక్తులు తయారయ్యారు. ఆశారాం వెబ్‌ సైట్ ప్రకారం ఆయనకు సుమారు 4 కోట్లు మంది అనుచరులు ఉన్నారు. అనేక రాజకీయవేత్తలు కూడా ఆశారాంకు స్నేహితులుగా ఉన్నారు. గతంలో ప్రధాని మోడీ కూడా ఆయన కార్యక్రమాలకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఆశారాంకు కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతి - ఫోర్జరీ కేసుల్లోనూ ఆశారాంపై విచారణ నిర్వహిస్తున్నారు. 2012లో 16 ఏళ్ల యువతిని రేప్ చేసిన కేసుతో పాటు సూరత్‌ కు చెందిన మరో మహిళను రేప్ చేసిన కేసులో ఆశారాం కోర్టు కేసును ఎదుర్కొంటున్నారు. ఆ కేసుల్లోనూ విచారణ కొనసాగుతోంది. ఈ కేసుల్లో మొత్తం 9 మంది సాక్షులపై దాడులు జరిగాయి.