Begin typing your search above and press return to search.

మజ్లిస్ పార్టీ అధినేత ఒవైసీ స్పందించాడు!

By:  Tupaki Desk   |   30 Sep 2016 10:53 AM GMT
మజ్లిస్ పార్టీ అధినేత ఒవైసీ స్పందించాడు!
X
పాకిస్థాన్ పై భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్‌ పై దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నుంచి సానుకూల స్పందన లభించిన విషయం తెలిసిందే. అయితే... భారత్ మాతాకీ జై అని అనడానికి గతంలో నిరాకరించి దేశ ప్రజల ఆగ్రహాన్ని చవిచూసిన మజ్లిస్ పార్టీ అధినేత ఒవైసీ కూడా ఇప్పుడు పాక్ పై భారత్ చేసిన దాడులను సమర్థించారు. ఉగ్రవాదం - పాక్ విషయంలో అనుసరించే అనుమానాస్పద వైఖరి కారణంగా ఒవైసీపై కొన్ని వర్గాల్లో అనుమానాలు ఉండడం... ఈ ఏడాదిలోనే ఆయన భారత్ మాతాకీ జై అనడానికి నిరాకరించడంతో తాజా పరిణామాలపై ఎలా స్పందిస్తారా అని చాలామంది ఆసక్తిగా చూశారు. అయితే... ఒవైసీ మాత్రం తాను అచ్చమైన భారతీయుడునని మరోమారు నిరూపించారు. సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలను మన సైన్యం ధ్వంసం చేయడాన్ని ఆయన స్వాగతించారు.

భారతదేశానికి - మన సైన్యానికి ఎంఐఎం పూర్తి మద్దతు పలుకుతున్నట్లు ఒవైసీ ప్రకటించారు. దేశ సాయుధ బలగాలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము దానికి వ్యతిరేకమని పేర్కొన్న అసదుద్దీన్... పాక్ విషయంలో భారత్ చేస్తున్న దాడులు సమర్థనీయమని చెప్పారు.

కాగా మన సైన్యం సాధించిన విజయాలపై క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంకో విధంగా స్పందించారు. తనదైన శైలిలో ఆయన కామెంటు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్ లోనూ స్వచ్ఛ భారత్ నిర్వహించారంటూ ఆయన ప్రశంసలు కురిపించారు. తొలుత ‘ఇండియన్ ఆర్మీకి సెల్యూట్. వారు చాలా చక్కగా ఆడారు. జై హింద్’ అంటూ ట్వీట్ చేసిన సెహ్వాగ్.. తన రెండో ట్వీట్ లో ‘‘ప్రధాని స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని సరిహద్దులు దాటించి పొరుగుదేశంలోనూ మొదలు పెట్టారు’’ అని అన్నారు. ఉగ్రవాదులనే చెత్తను ఆయన ఊడ్చిపడేస్తున్నారన్న ఉద్దేశంలో సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఒవైసీ - సెహ్వాగ్ ల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతున్నాయి.