Begin typing your search above and press return to search.

ఆర్మీ చీఫ్‌ కు వార్నింగ్ ఇచ్చిన ఓవైసీ

By:  Tupaki Desk   |   22 Feb 2018 10:52 AM GMT
ఆర్మీ చీఫ్‌ కు వార్నింగ్ ఇచ్చిన ఓవైసీ
X
భార‌త ఆర్మీచీఫ్‌ కు హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ కేంద్రంగా ఎదిగిన ఎంఐఎం పార్టీ అధినేత - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్ ఇచ్చారు.

ఏకంగా ప‌నిచూసుకోవాలంటూ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌పై ఓవైసీ సీరియస్ అయ్యారు. అస్సాంలో ముస్లింల జనాభా చాలా వేగంగా వృద్ధి చెందుతుండటంపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌ స్పందిస్తూ.. ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ గురించి బిపిన్ రావత్ ప్రస్తావించారు. `బీజేపీ కంటే వేగంగా ఇక్కడ ఏఐయూడీఎఫ్ వృద్ధి చెందుతోంది. ఇక్కడ పక్కా ప్రణాళిక ప్రకారమే వలసలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది` అని రావత్ చెప్పారు. పాక్ ఆలోచ‌న గురించి ఆర్మీ చీఫ్ ప్ర‌స్తావించ‌డంపై ఓవైసీకి కోపం వ‌చ్చినట్లుంది. దీంతో
ఆర్మీ చీఫ్‌ కు రాజకీయాలతో పనేంటని ప్రశ్నించారు.

ఈశాన్య ప్రాంతాల్లోని సరిహద్దులను రక్షించడం ఎలా అన్న కాన్ఫరెన్స్‌ లో భాగంగా ఆర్మీ చీఫ్ ప్రసంగించారు. అస్సాంలో మౌలానా బహ్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ పటిష్టమవుతుండటంపై బిపిన్ రావత్ స్పందించారు. దీనిని అసద్ తీవ్రంగా తప్పుబట్టారు. ``రాజకీయ పార్టీలతో ఆర్మీకి ఏం పని.. ఇందులో బిపిన్ జోక్యం చేసుకోవడం తగదు. రాజకీయ పార్టీలపై ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు. రాజ్యాంగం ప్రకారం.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి లోబడి ఆర్మీ పనిచేయాలి` అంటూ అసద్ ట్వీట్ చేశారు. అస్సాంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి నివాసముంటున్నవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుండటం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆర్మీ చీఫ్ ఆందోళ‌న చెంద‌గా అస‌ద్ ఫైర‌య్యారు.

కాగా, ఇటీవలి సుంజ్వాన్ దాడిలో చనిపోయిన ఏడుగురికి కూడా మ‌తంతో ముడిపెట్టి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. మ‌ర‌ణించిన వారిలో ఐదుగురు ముస్లింలేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. దీనిపై భారత సైన్యం ఉత్తర కమాండ్ చీఫ్ లెప్ట్‌ నెంట్ జనరల్ దేవరాజ్ అన్బు స్పందించారు. అమర సైనికులను ఆర్మీ ఎప్పుడూ మతపరంగా విభజించి చూడదని తెలిపారు. తాము అమరులకు మతాన్ని ఆపాదించబోమని, అసలు సైన్యం అంటే ఏంటో తెలియనివారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఘాటుగా స్పందించారు.