Begin typing your search above and press return to search.

మోడీకి ఓవైసీ స్పెష‌ల్ థ్యాంక్స్‌

By:  Tupaki Desk   |   20 Jan 2018 5:33 PM GMT
మోడీకి ఓవైసీ స్పెష‌ల్ థ్యాంక్స్‌
X
ఔను! సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కృతజ్ఞతలు తెలిపారు. త‌ర‌చుగా నిప్పులు చెరిగే ఓవైసీ..ప్ర‌ధానికి ఎందుకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారంటే..దానికి ఓవైసీ లెక్క‌లు వేరే ఉన్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదించిన ట్రిపుల్ తలాక్ (ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ) బిల్లు - 2017 వ‌ల్ల ఈ థ్యాంక్స్ చెప్పారు. ఇంత‌కాలం వ్య‌తిరేకించి ఇప్పుడెందుకు.. థ్యాంక్స్ చెప్తున్నారంటే మోడీ ముస్లింల‌ను ఏకం చేశార‌ట‌! ట్రిపుల్ తలాక్ అంశాన్ని మోడీ లేవనెత్తడం వల్లే ముస్లింలందరూ ఏకమయ్యారని ఓవైసీ పేర్కొన్నారు.

కర్నూలులో పర్యటించిన ఎంపీ ఒవైసీ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 11న హైదరాబాద్‌ లో సభ నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఎవరైనా ముమ్మారు తలాక్ చెబితే వారిని సంఘ బహిష్కరణ చేయాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపు నిచ్చారు. ముస్లిం మహిళలపై కేంద్రానికి నిజంగా ప్రేమ ఉంటే బడ్జెట్‌ లో రూ.2 వేల కోట్లు కేటాయించి.. ప్రతీ మహిళకు రూ.25 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలేవైనా ఉంటే మత పెద్దల వద్ద పరిష్కరించుకోవాలని అసదుద్దీన్ సూచించారు.అదేవిధంగా అయోధ్య రామమందిర నిర్మాణంపై స్పందిస్తూ.. ఆ సమస్య కోర్టు పరిధిలో ఉందని దాని గురించి మాట్లాడనని వివరించారు.

కాగా, త‌లాక్‌ పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కుంప‌ట్లు రాజేస్తున్న సంగ‌తి తెలిసిందే. మూడు సార్లు త‌లాక్ చెప్ప‌డం ద్వారా భార్య‌ను వ‌దిలించుకునే విధానానికి బ్రేక్ వేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని ఇప్ప‌టికై ఓవైసీ స‌హా ముస్లిం పెద్ద‌లు వ్య‌తిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు లక్నోలో అత్యవసర సమావేశం జ‌రిపింది. ఇందులో అధ్యక్షుడు మౌలా నా రబే హసనీ నద్వి, ప్రధాన కార్యదర్శి మహ్మద్ వలీ రహ్మా నీ, బోర్డు సభ్యుడు అయిన ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. దానికి కొన‌సాగింపుగానే ఓవైసీ క‌ర్నూల్‌లో ప‌ర్య‌టించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.