Begin typing your search above and press return to search.

అస‌ద్ క‌ల నెర‌వేర‌లేదు.. కారు దూసుకొచ్చింది

By:  Tupaki Desk   |   12 Dec 2018 5:15 AM GMT
అస‌ద్ క‌ల నెర‌వేర‌లేదు.. కారు దూసుకొచ్చింది
X
కారు ఎక్క‌డికైనా వెళ్లొచ్చు.. కానీ.. దాని జోరంతా అవుట‌ర్ రింగు రోడ్డుకు అవ‌త‌లే. రింగురోడ్డు లోప‌ల‌కు వ‌స్తానంటే కుద‌ర‌దు..ఇలా కాస్తంత ముద్దుగా.. మ‌రికాస్త మురిపెంతో పాటు.. హెచ్చ‌రిక ధోర‌ణిలో కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడే ద‌మ్ము ధైర్యం ఆయ‌న‌కు జానీ జిగిరి దోస్త్ అస‌ద్ భ‌య్‌కే చెల్లుతుంది. ఎన్నిక‌లు ఎలాంటి సెంటిమెంట్‌ లో జ‌రిగినా.. ఎవ‌రి గాలి ఎంత వీచినా.. పాత‌బ‌స్తీ ప‌రిధిలోని ఏడు స్థానాల్లో మ‌జ్లిస్ జెండా ఎగ‌ర‌టం మొద‌ట్నించి ఉన్న‌దే.

ఈసారి కూడా అందుకు భిన్న‌మైన ఫ‌లితాలు వెలువ‌డ‌లేదు. అయితే.. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతుంటాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీల మ‌ధ్య ఇలాంటివి స‌హ‌జ‌మే అయినా.. టీఆర్ ఎస్‌.. మ‌జ్లిస్ లాంటి ఫ్రెండ్లీ పార్టీల మ‌ధ్య కూడా ఇదే తీరులో ఉండ‌టం ఆస‌క్తిక‌రం.

మిత్రుడు మ‌జ్లిస్ పైన‌ టీఆర్ ఎస్ కానీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ కానీ ఎప్పుడు మాట జారింది లేదు. అదే స‌మ‌యంలో అస‌ద్ మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఆయ‌న కానీ ఆయ‌న సోద‌రుడు అక్బరుద్దీన్ తీరు మాత్రం వేరుగా ఉంటుంది. తాజా జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాజేంద్ర‌న‌గ‌ర్ సీటుపై మ‌జ్లిస్ క‌న్ను ప‌డింది. ఈసారి ఎలాగైనా త‌మ‌కున్న ఏడు స్కోర్ ను ఎనిమిదికి పెంచుకోవాల‌న్న తాప‌త్ర‌యం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది.

అస‌ద్ నివాసం ఉండే నియోజ‌క‌వ‌ర్గ‌మైన రాజేంద్ర‌న‌గ‌ర్ లో మ‌జ్లిస్ పార్టీ జెండా రెప‌రెప‌లాడాల‌న్న ఆత్రుత ఆయ‌న మాట‌ల్లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది. ఔట‌ర్ రింగు రోడ్డు మీద ఎక్క‌డికైనా కారు వెళ్లొచ్చు కానీ ఔట‌ర్ రింగు రోడ్డు దిగి వ‌స్తానంటే మాత్రం ఒప్పుకోమంటూ చెప్పిన మాట‌లు ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించాయి. పాత‌బ‌స్తీ ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు.. ఎనిమిదో నియోజ‌క‌వ‌ర్గ‌మైన రాజేంద్ర‌న‌గ‌ర్ లోకి టీఆర్ ఎస్ ఎంట‌ర్ కాకూడ‌ద‌న్న మాట‌ను అభ్య‌ర్థ‌న‌తో కూడిన హెచ్చ‌రిక‌ను చేశారు.

అస‌ద్ ఏమ‌న్నా పెద్ద‌గా రియాక్ట్ కాని కేసీఆర్ ఔట‌ర్ రింగు రోడ్డు లోప‌ల‌కు కారు రాకూడ‌ద‌న్న మాట‌ను లైట్ తీసుకున్నారు. త‌న‌కు న‌చ్చినోళ్లు.. త‌న‌కు అవ‌స‌రం ఉన్నోళ్లు ఎంత‌లా చెల‌రేగిపోయినా ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే అల‌వాటున్న కేసీఆర్‌.. అస‌ద్ విష‌యంలోనూ అలాంటి సూత్రాన్నే అప్లై చేస్తుంటారు. ఒట్టి మాట‌లు ఎందుకు? చేత‌ల్లో చేసి చూపిస్తే స‌రిపోతుంద‌నుకున్నారేమో కానీ.. అస‌ద్ కోరుకున్న‌ట్లు కాకుండా రాజేంద్ర‌న‌గ‌ర్ ఫ‌లితం టీఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా వ‌చ్చింది. కారును ఔట‌ర్ లోప‌ల‌కు అనుమ‌తించ‌మ‌న్న అస‌ద్ మాట ఎలాంటి ప్ర‌భావం చూపించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.