Begin typing your search above and press return to search.

ఫ్రెండ్‌ ను దెబ్బేసేలా అస‌ద్ మాట‌లు?

By:  Tupaki Desk   |   26 May 2017 10:01 AM GMT
ఫ్రెండ్‌ ను దెబ్బేసేలా అస‌ద్ మాట‌లు?
X
కొద్దికాలంగా మౌనంగా ఉంటున్న మ‌జ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. గ‌డిచిన రెండురోజులుగా యాక్టివ్ అయిపోయారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న త‌ర్వాత నుంచి ఆయ‌న డైలీ బేసిస్‌ లో మాట్లాడ‌టం క‌నిపిస్తుంది. నిన్న‌టికి నిన్న అమిత్ షాకు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన అస‌ద్‌.. తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ ఎంపీ సీటే కాదు.. సికింద్రాబాద్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం కూడా త‌మ‌దేన‌ని తేల్చేశారు.

సికింద్రాబాద్ సిట్టింగ్ బీజేపీ అభ్య‌ర్థిని త‌మ పార్టీ అభ్య‌ర్థి ఓడించ‌టం ఖాయ‌మ‌న్న‌ట్లుగా మ‌జ్లిస్ అధినేత మాట్లాడుతున్నారు. అదంతా బాగానే ఉన్నా.. సికింద్రాబాద్ ఎంపీ స్థానంతో పాటు.. బీజేపీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గోషామ‌హల్‌.. అంబ‌ర్ పేట‌.. ఉప్ప‌ల్‌.. ముషీరాబాద్‌.. ఖైర‌తాబాద్ అసెంబ్లీ స్థానాల్ని మ‌జ్లిస్ చేజిక్కించుకుంటుంద‌ని అస‌ద్ చెబుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ సాగిన రాజకీయానికి భిన్నంగా అస‌ద్ మాట‌లు ఉండ‌టం ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామంగా చెప్పాలి. ఎందుకంటే.. అధికారంలో ఎవ‌రు ఉన్నా వారితో స్నేహాన్ని కొన‌సాగించ‌టం మ‌జ్లిస్ చేస్తున్న ప‌ని. దానికి మిన‌హాయింపు అన్న‌ది ఏమైనా ఉందంటే అది కిర‌ణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు మాత్ర‌మే. మిగిలిన స‌మ‌యాల్లో అధికార‌ప‌క్షానికి స‌న్నిహితంగా ఉంటూ ఎన్నిక‌ల వేళ‌.. మ‌జ్లిస్ ప్రాతినిధ్యం వ‌హించే నియోజ‌క‌వ‌ర్గాలపై అధికార‌ప‌క్షం క‌న్నేయ‌కుండా ఉండ‌టం జ‌రుగుతుంది. ఇదే సూత్రం ఈసారి కూడా అప్లై అవుతుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మైంది. అయితే.. అందుకు భిన్నంగా అస‌ద్ తాజా మాట‌లు ఉన్నాయి.

బీజేపీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అసెంబ్లీ స్థానాలపై అధికార టీఆర్ ఎస్ ఇప్ప‌టికే క‌న్నేసింది. వాటిని సొంతం చేసుకోవ‌టానికి పావులు క‌దుపుతున్న వేళ‌.. టీఆర్ఎస్ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేలా అస‌ద్ వ్యాఖ్య‌లు చేయ‌టం ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్పాలి. ఇప్ప‌టివ‌ర‌కూ పాత‌బ‌స్తీ మీద త‌మ ప‌ట్టు ఉంటే చాల‌న్న భావ‌న‌లో ఉన్న అస‌ద్ అండ్ కో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో త‌మ ముద్ర బ‌లంగా వేయాల‌న్న త‌ప‌న తాజా మాట‌ల్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. మ‌రీ.. విష‌యంపై అస‌ద్‌ను త‌ర‌చూ స్నేహితుడిగా ప్ర‌స్తావించే కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/