Begin typing your search above and press return to search.

అస‌దుద్దీన్ ఓవైసీ భార్య‌కు లోన్‌!

By:  Tupaki Desk   |   28 April 2016 7:24 AM GMT
అస‌దుద్దీన్ ఓవైసీ భార్య‌కు లోన్‌!
X
విష‌యం ఏదైనా, సంద‌ర్భం ఎలాంటిదైనా మైనార్టీల ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డమే కాకుండా చ‌ర్చ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించే హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి ఘ‌ట్టి షాక్ త‌గిలింది. అదికూడా మరో మైనార్టీ నేత నుంచి అంతే కాకుండా మైనార్టీ నాయ‌కురాలి నుంచి కావ‌డం ఆస‌క్తిక‌రం. ఎస్సీ - ఎస్టీలకు ప్రవేశపెట్టిన పథకంలో మహిళలకు అవకాశం కల్పించడంపై లోక్‌ సభలో ఆర్జేడీ ఎంపీ జయప్రకాశ్‌ నారాయణ్‌ యాదవ్‌ అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మాహెప్తుల్లా సమాధానమిస్తుండ‌గా అసదుద్దీన్ జోక్యం చేసుకోవ‌డంతో ఆమె ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన స్టార్ట్ అప్ ఇండియా ప‌థ‌కంలో ఎస్సీ - ఎస్టీల‌తో పాటు మైనార్టీ మహిళలను భాగస్వామ్యం చేశారని న‌జ్మాహెప్తుల్లా తెలిపారు. మహిళలందరూ వెనుకబడ్డారని, అందుకోసమే ప్రధానమంత్రి ఈ పథకం ప్రవేశపెట్టార‌ని అన్నారు. ఈ సందర్భంగా ఒవైసీ ముస్లిం మ‌హిళ‌ల సంగతేంట‌ని ప్ర‌స్తావించారు. అస‌లు త‌మ వ‌ర్గానికి ప్రాధాన్యం లేద‌ని వ్యాఖ్యానించారు. దీనికి నజ్మాహెప్తుల్లా స్పందిస్తూ 'ఒవైసీ సాహెబ్‌..! మీ భార్య పేరు మీద కూడా రుణం తీసుకొవచ్చు' అని అన్నారు. దీంతో ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నేను మీ భర్త గురించి మాట్లాడాలా?' అని నజ్మా హెప్తుల్లాను ఉద్దేశించి అన్నారు. సభలో తన భార్య గురించి ప్రస్తావించడం తప్పన్నారు. 'మీరు వ్యక్తిగతంగా వెళ్లకండి. మీరు, నేను వేర్వేరు రాజకీయ సిద్ధాంతాలకు చెందినవాళ్లం. మీరు చాలా సీనియర్‌ సభ్యులు. వ్యక్తిగత అంశాలు జోలికెళ్లకండి' అని అభ్యంతరం తెలిపారు. 'నేనీమీ తప్పు వ్యాఖ్యలు చేయలేదు. మహిళలను ఈ పథకంలో భాగస్వామ్యం చేశాం. ఒకవేళ మీ భార్య ఈ పథకంలో రుణం తీసుకోవాల నుకుంటే తీసుకొవచ్చు' అని మాత్రమే అన్నానని నజ్మాహెప్తుల్లా స్ప‌ష్టం చేశారు.

అయితే ఈ క్ర‌మంలో ఇటు ఓవైసీ, అటు బీజేపీ సభ్యుల ఆందోళనతో పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి వెంకయ్య నాయుడు జోక్యం చేసుకున్నారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు చెప్పారు. అనంత‌రం అస‌దుద్దీన్ మాట్లాడుతూ నజ్మాహెప్తుల్లా లాంటి సీనియర్‌ నాయకులు ఇలాంటి వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.