Begin typing your search above and press return to search.

కేసీఆర్‌, బాబును ఇరుకున పెట్టిన కేజ్రివాల్‌

By:  Tupaki Desk   |   26 Nov 2015 4:31 PM GMT
కేసీఆర్‌, బాబును ఇరుకున పెట్టిన కేజ్రివాల్‌
X
ప్ర‌జా సంక్షేమ నాయ‌కులు పాల‌న‌ప‌గ్గాలు చేప‌డితే వారిపై ఉండే అంచనాల రేంజ్ వేరే ఉంటుంది. మిగ‌తా నాయ‌కుల‌తో వారిని అస్స‌లు పోల్చుకోరు. అదే క్ర‌మంలో సామాన్యుడి అభిప్రాయానికి పెద్ద‌పీట వేస్తే ఎంతో గౌర‌విస్తారు. తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబు నాయుడు - కే చంద్ర‌శేఖ‌ర్ రావు ఇద్ద‌రూ ఇద్ద‌రే. వారికి ప్ర‌జ‌ల మ‌నోభావాలు చ‌క్క‌గా తెలుసుకోవ‌చ్చు. ఇదే క్ర‌మంలో ఢిల్లీ ప‌గ్గాలు చేప‌ట్టిన అరవింద్ కేజ్రివాల్ కూడా చేరిపోతారు. ఐఆర్ఎస్ అధికారి అయిన కేజ్రివాల్ ఏకంగా త‌న పార్టీకి ఆమ్ ఆద్మీ అని పేరు పెట్టారంటే కేజ్రి ప్రేమ‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

ఢిల్లీ సీఎంగా రెండో ద‌ఫా ప‌గ్గాలు చేప‌ట్టిన కేజ్రివాల్ మ‌రో సూప‌ర్ డూప‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు. కేజ్రివాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు చేపట్టేదిశగా ముందడుగు వేసింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. వేజ్‌ బోర్డును అమల‌చేయాల‌ని జ‌స్టిస్‌ మజీథియా కమిటీ సిఫార్సులను ఖచ్చితంగా అమలు చేసేలా నిబంధనలను రూపొందించి ఢిల్లీ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. చాలా మీడియా యాజమాన్య సంస్థలు మజీథియా సిఫార్సులను అమలు చేయకపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం చట్టం చేసి ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టింది.

ఢిల్లీ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లులో నిబంధనలు ఈ విధంగా ఉన్నాయి. జర్నలిస్టులకు కనీస వేతనం రూ.25వేలు, నాన్ జర్నలిస్టులకు కనీస వేతనం రూ. 17,500గా చెల్లింపును త‌ప్ప‌నిస‌రి చేసింది. తాజా సవరణల ప్రకారం సంస్థల ఆదాయాన్ని బట్టి మీడియా సంస్థలను 8 విభాగాలుగా, న్యూస్ ఏజెన్సీలను 4 విభాగాలుగా వర్గీకరించారు. పదవీ విరమణ వయస్సు 65సంవత్సరాలుగా నిర్ణయించడంతోపాటు పితృత సెలవులు కూడా ఇవ్వాలని తాజా బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లు చ‌ట్టంగా మారాల్సి ఉంది. అయితే ఢిల్లీ అసెంబ్లీలో బిల్లు నెగ్గేందుకు కావాల్సిన మెజార్టీ కంటే రెట్టింపు స‌భ్యుల బ‌లం ఆప్ పార్టీకి ఉన్నందున నెగ్గ‌డం పెద్ద విష‌యం కాక‌పోవ‌చ్చు.

ఇదిలాఉండ‌గా ఈ నిర్ణ‌యం తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులకు ఒకింత ఇర‌కాటంగా మార‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఢిల్లీ త‌ర్వాత క‌రెక్టుగా చెప్పాలంటే అదే స్థాయిలో మీడియా సంస్థ‌లు ఉన్నది తెలుగు రాష్ర్టాల్లోనే. ఈనేప‌థ్యంలో ఇక్క‌డ కూడా అదే డిమాండ్ వ‌స్తే... సీఎంలు ఇర‌కాటంలో ప‌డ‌టం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు.