Begin typing your search above and press return to search.

సోనియాపైకి మోడీని ఉసిగొల్పుతున్న కేజ్రీ

By:  Tupaki Desk   |   29 April 2016 7:41 AM GMT
సోనియాపైకి మోడీని ఉసిగొల్పుతున్న కేజ్రీ
X
రాజకీయ చతురతలో ఢిల్లీ సీఎం - ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరితేరిపోతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారును ఆయన తెలివిగా సోనియాగాంధీపైకి ఉసిగొల్పుతున్నారు. బీజేపీపై మండిపడుతున్న ఆయన అదే సమయంలో సవాళ్లలో ఆ పార్టీని రెచ్చగొడుతున్నారు. పనిలో పనిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ - ఆ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. అంతేకాదు... మోడీ - సోనియాల మధ్య రహస్య ఒప్పందం ఉందని.. అందుకే, ఆమెపై చర్యలు తీసుకోవడం లేదని కూడా కేజ్రీ ఆరోపిస్తున్నారు.

అగస్టా వెస్టు ల్యాండ్ కుంభకోణంలో ఇటాలియన్ కోర్టు నిందితులుగా పేర్కొన్న సోనియా గాంధీ - కాంగ్రెస్ పార్టీ నేతలను దమ్ముంటే అరెస్టు చేయాలని మోదీ సర్కారుకు కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఈ కేసులో తాను నిందితుడిగా ఉండి ఉంటే... ఇప్పటికే అరెస్టయి ఉండేవాడినని పేర్కొన్న ఆయన ... సోనియాను అరెస్టు చేయడానికి మోడీ ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. తాజాగా శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా మోడీ గవర్నమెంటుపై దాడి మొదలుపెట్టారు.

బీజేపీని రెచ్చగొట్టి సోనియాను అరెస్టు చేయిస్తే అది ఆ రెండు పార్టీలకూ ఇబ్బందేనని కేజ్రీ అభిప్రాయపడుతున్నారు. ఆ కారణంగానే బీజేపీ వేలితో కాంగ్రెస్ కన్ను పొడవాలని కేజ్రీ ప్రయత్నిస్తున్నారు. అయితే.. అలాంటి ఒత్తిళ్లకు, సవాళ్లకు మోడీ అంత ఈజీగా పడడం కష్టమేనని వినిపిస్తోంది.

మరోవైపు బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి కూడా ఈ కేసులో సోనియాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో సోనియా గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నేతలను పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయని స్వామి ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. జెనీవాలోని ‘సరసిన్ బ్యాంక్’లో సోనియా ఆ ముడుపులను దాచిపెట్టారని చెబుతున్నారు. అనంతరం అక్కడి నుంచి కొంత నగదును తీసి ‘పిక్ టెట్ బ్యాంకు’లో డిపాజిట్ ని ఈడీ దీనిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.