Begin typing your search above and press return to search.

సీఎంపై రేప్ ఆరోప‌ణ‌లు..ఎన్ సీ డ‌బ్ల్యూకు ఫిర్యాదు!

By:  Tupaki Desk   |   19 Feb 2018 1:03 PM GMT
సీఎంపై రేప్ ఆరోప‌ణ‌లు..ఎన్ సీ డ‌బ్ల్యూకు ఫిర్యాదు!
X
అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండూపై ఓ యువతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పేమా ఖండూతో పాటు మరో ఇద్ద‌రు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారం చేశార‌ని షాకింగ్ కామెంట్స్ చేసింది. 2008 జులైలో ఈ దారుణం జ‌రిగింద‌ని, అప్ప‌టికి పేమా ఖండూ సీఎం కాద‌ని త‌న ఫిర్యాదులో పేర్కొంది. త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ పేమా ఖండూ, మ‌రో ఇద్ద‌రిపై జాతీయ మ‌హిళా క‌మిష‌న్(ఎన్ సీ డ‌బ్ల్యూ) కు ఫిర్యాదు చేసింది. తాను స్పృహలో లేని స‌మ‌యంలో వారు త‌న‌ను రేప్ చేశార‌ని ఆమె ఆరోపించింది. ఇదే విష‌యంపై ఇప్ప‌టికే పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని, కోర్టులో కేసు కూడా న‌డిచింద‌ని తెలిపింది. అయితే, అక్క‌డ త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌డంతోనే ఎన్ సీ డ‌బ్ల్యూను ఆశ్ర‌యించాన‌ని ఆమె మీడియాకు తెలిపింది.

ఈ కేసుకు సంబంధించిన త‌న‌కు ఇప్పటివరకు ఎటువంటి సాయం అందలేద‌ని, త‌న‌పై సీఎం అత్యాచారం చేశాడంటే ప్రజలు, పోలీసులు న‌మ్మ‌డం లేద‌ని ఆమె వాపోయింది. త‌న త‌ర‌ఫున వాదిస్తోన్న ఓ మహిళా న్యాయవాది, ఓ స్వ‌చ్ఛంద సేవా సంస్థ సాయంతో ఎన్ సీ డ‌బ్ల్యూను ఆశ్రయించానని చెప్పింది. ఇక్కడ త‌న‌కు న్యాయం జరగుతుంద‌నే న‌మ్మ‌క‌ముందని, ఒక‌వేళ ఇక్క‌డ కూడా జ‌ర‌గ‌క‌పోతే త‌న‌లాంటి బాధితులు ఫిర్యాదు చేయ‌డానికి ముందుకు కూడా రార‌ని తెలిపింది. త‌న‌కు అన్యాయం జ‌రిగితే భ‌విష్య‌త్తులో త‌న‌లాంటి వారు చేసే అత్యాచార ఆరోప‌ణ‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని తెలిపింది. తాను కేవలం ప్ర‌చారం కోస‌మే ఇదంతా చేస్తున్నానని సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని, ప‌బ్లిసిటీ కోసం రేప్ న‌కు గుర‌య్యాన‌ని చెప్పుకునేంత నీచానికి తాను దిగ‌జార‌న‌ని, త‌న‌కు జ‌రిగిన అన్యాయ‌పంఐ తుదిశ్వాస వరకూ పోరాడుతాన‌ని చెప్పింది. ఆ యువ‌తి నుంచి త‌మ‌కు ఫిర్యాదు అందింద‌ని ఎన్ సీ డ‌బ్ల్యూ ఇన్ చార్జి చైర్మ‌న్ రేఖా శ‌ర్మ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి విచార‌ణ చేప‌డ‌తామ‌ని తెలిపారు. అయితే, ఈ కేసును అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ కోర్టు కొట్టివేసినందువ‌ల్ల దీనికి సంబంధించి న్యాయ స‌ల‌హా తీసుకోవాల‌ని భావిస్తున్నామ‌ని చెప్పారు.

అయితే, త‌న‌పై వ‌చ్చిన వ్యాఖ్య‌ల‌ను పేమా ఖండూ ఖండించారు. త‌న‌పై ఆ యువ‌తి చేసిన ఆరోప‌ణ‌లు చూసి షాక్ అయ్యాన‌ని చెప్పారు. అవ‌న్నీ త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ని కొట్టిప‌డేశారు. రాజ‌కీయ ల‌బ్ధి కోసం ప్ర‌తిప‌క్షాలు త‌న‌పై ఇటువంటి నీచ‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నాయ‌ని చెప్పారు. ప్ర‌త్య‌ర్థులు త‌న‌ను రాజ‌కీయంగా ఎదుర్కొన‌లేక ఇటువంటి ప‌నుల‌కు పాల్ప‌డి అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాజకీయాలకు చెడ్డ‌పేరు తీసుకువ‌స్తున్నార‌ని మండిపడ్డారు. మ‌రోవైపు, పేమా పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు త‌పిర్ గావో తీవ్రంగా ఖండించారు. రాజ‌కీయాల్లో ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, పోటీ, గెలుపోట‌ములు స‌హ‌జ‌మ‌ని, అయితే, ఈ ర‌కంగా మ‌హిళ‌ల‌ను అడ్డుపెట్టుకొని ఆరోప‌ణ‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. 2008లో రేప్ జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల‌పై 2015లో ఎఫ్ ఐ ఆర్ న‌మోదైంద‌ని, అప్పుడు కేబినెట్ మంత్రిగా ఉన్న పేమా ఖండూ విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రించార‌ని తెలిపారు. ఈ కేసులో పేమా నిర్దోషి అని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ కోర్టు తీర్పునిచ్చింద‌ని గుర్తు చేశారు. కేవ‌లం రాజ‌కీయ ల‌బ్ధి కోసం కాంగ్రెస్ ఇటువంటి త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తోంద‌ని మండిప‌డ్డారు.