హెచ్1బీపై జైట్లీ అమెరికాకు గట్టిగానే చెప్పారు

Fri Apr 21 2017 14:58:21 GMT+0530 (IST)

భారత ఐటీ రంగానికి ఎంతో ముఖ్యమైన హెచ్1బీ వీసాల అంశంపై తమ వాదనను అమెరికా ముందు  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బలంగా వినిపించారు. ఈ విషయంలో మీ వైఖరి ఏమాత్రం బాగా లేదని స్పష్టంచేశారు. ప్రతినిధి బృందంతో కలిసి అమెరికా వెళ్లిన జైట్లీ.. ఆ దేశ వాణిజ్యశాఖ మంత్రి విల్బర్ రాస్ తో సమావేశమయ్యారు. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు దేశాల మధ్య కేబినెట్ స్థాయి చర్చలు జరగడం ఇదే తొలిసారి. దీంతో అతి ముఖ్యమైన హెచ్1బీ వీసాల అంశాన్నే జైట్లీ లేవనెత్తారు. భారత్‌కు చెందిన నిపుణులు అమెరికా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడిన విషయాన్ని ఈ సందర్భంగా జైట్లీ గుర్తు చేశారు. అయితే హెచ్1బీ వీసాలపై పునఃసమీక్షను ఇప్పుడే తాము ప్రారంభించామని దీనిపై తుది నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదని రాస్.. జైట్లీతో అన్నారు.

భారత ఐటీ కంపెనీలు - ప్రొఫెషనల్స్ తరఫున హెచ్1బీ వీసాల అంశాన్ని జైట్లీ లేవనెత్తారు. భారత నిపుణులు రెండు దేశాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారని ఇదే కొనసాగాల్సిన అవసరముందని జైట్లీ నొక్కి చెప్పారు. ఇది రెండు దేశాల ప్రయోజనాలకు మంచిదని జైట్లీ స్పష్టం చేసినట్లు ప్రతినిధి బృందంలోని ఒక అధికారి అన్నారు. ఈ సందర్భంగా రాస్ మాట్లాడుతూ.. హెచ్1బీ సమీక్ష ప్రక్రియ ఎలాంటి ఫలితాలను ఇచ్చినా.. నైపుణ్య ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అమలు చేయడమే తమ ఉద్దేశమని స్పష్టంచేశారు. హెచ్1బీ వీసాల సమీక్ష కోసం ఈ మధ్యే అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేసిన విషయం తెలిసిందే.

రాస్ తో చర్చల సందర్భంగా.. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల గురించి జైట్లీ వివరించారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన వ్యూహాత్మక - ఆర్థిక - రక్షణ సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా జరిగే వరల్డ్ బ్యాంక్ - ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్గొననున్నారు. రాబోయే రెండు రోజులు జైట్లీ బిజిగా గడపనున్నారు. అమెరికా - ఆస్ట్రేలియా - ఫ్రాన్స్ - ఇండోనేషియా - స్వీడన్ లతో ద్వైపాక్షిక చర్చలు జరపగనున్నారు. బంగ్లాదేశ్ - శ్రీలంకల ఆర్థిక మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/