Begin typing your search above and press return to search.

ఆ లెక్క‌ల‌న్నీ చెప్పి హెచ్‌1బీలో మార్పులు కోరిన జైట్లీ

By:  Tupaki Desk   |   13 Oct 2017 1:56 PM GMT
ఆ లెక్క‌ల‌న్నీ చెప్పి హెచ్‌1బీలో మార్పులు కోరిన జైట్లీ
X
అవ‌కాశాల స్వ‌ర్గంగా పేరుపొందిన అమెరికాలో హెచ్‌1 - ఎల్1 వీసాల ద్వారా వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న భార‌తీయులు ఆ దేశ అబివృద్ధికి ఎలా స‌హ‌క‌రిస్తున్నారో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివ‌రించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల‌తో క‌లిసి అమెరికాలో వారం రోజుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన మంత్రి ఈ సంద‌ర్భంగా అమెరికా ప్ర‌జాప్ర‌తినిధుల‌తో చ‌ర్చించిన విష‌యాల‌ను ఆర్థిక శాఖ వివ‌రించింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ ముచిన్‌ తో చ‌ర్చ సంద‌ర్భంగా ఈ అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ``హెచ్1బీ - ఎల్‌1 వీసాల్లో సంస్క‌ర‌ణ‌లు రావాల్సిందేన‌ని జైట్లీ స్ప‌ష్టం చేశారు. అమెరికా అభివృద్ధికి వాళ్లు చేస్తున్న సేవ‌లు విస్మ‌రించ‌లేనివి. అమెరికా అభివృద్ధికి విశేష కృషి చేసిన ఈ వృత్తి నిపుణుల భాగ‌స్వామ్యాన్ని అమెరికా గుర్తించాలి`` అని కేంద్ర ఆర్థిక‌మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

మ‌రోవైపు వాషింగ్టన్‌ లోని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా పెట్టుబడిదారులకు భారత్‌ పై పాజిటివ్ ఆలోచన ఉన్నట్లు తెలిపారు. దేశ ఆర్థిక ప్రగతి కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల పట్ల అమెరికన్లకు మంచి భావనే ఉందని, భవిష్యత్తు కూడా బాగుంటుందన్న అభిప్రాయంలో అమెరికా ఇన్వెస్టర్లు ఉన్నట్లు జైట్లీ తెలిపారు. బోస్టన్ - న్యూయార్క్ నగరాల్లో ఆయన తాజాగా పర్యటించారు. ఆ టూర్‌ లో పెట్టుబడిదారులు - కార్పొరేట్ లీడర్లతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఐఎంఎఫ్ ఆఫీసులో భారతీయ వాణిజ్య సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ అంశాలను వెల్లడించారు. అమెరికా ఇన్వెస్టర్లతో గత రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నామని, అయితే వారికి భారత్ పట్ల పాజిటివ్ దృక్ఫథం ఉన్నట్లు గుర్తించామని జైట్లీ తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం కూడా భారత్‌పై ఆశాజనకంగా ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు.

ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై.. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ ముచిన్.. కామర్స్ సెక్రటరీ విల్‌ బర్ రాస్‌ తో జైట్లీ సమావేశం అయ్యారు. ఇద్దరు కూడా భారత్‌ తో వాణిజ్యానికి ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. వారం రోజుల పాటు సాగే జైట్లీ ప‌ర్య‌ట‌న‌లో కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌రిపి త‌ర్వాత దౌత్య‌ప‌ర‌మైన సంక్లిష్ట‌ అంశాలు కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.