Begin typing your search above and press return to search.

జైట్లీ హ‌ల్వా రెడీ అయిపోయిందిగా!

By:  Tupaki Desk   |   20 Jan 2017 4:53 AM GMT
జైట్లీ హ‌ల్వా రెడీ అయిపోయిందిగా!
X
నిజ‌మేనండోయ్‌... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ త‌న శాఖ సిబ్బందికి హ‌ల్వా వ‌డ్డించేశారు. అంటే... వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి (2017-18)కి సంబంధించిన కేంద్ర బ‌డ్జెట్ క‌స‌రత్తును పూర్తి చేసిన‌ట్లు జైట్లీ నిన్న చెప్ప‌క‌నే చెప్పేశారు. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత వ‌చ్చే బ‌డ్జెట్‌ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు వెలువ‌రించే అవ‌కాశాలున్నాయ‌న్న వాద‌న నేప‌థ్యంలో... జైట్లీ వండి వార్చిన హ‌ల్వా రుచి ఎలా ఉంటుందోన‌న్న ఆస‌క్తికి తెర లేసేసింద‌నే చెప్పాలి. పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఇప్ప‌టికే జ‌నం వ‌ద్ద ఉన్న క‌రెన్సీ మొత్తం బ్యాంకుల‌కు చేరిపోయింది. దీంతో బ్యాంకుల గ‌ల్లా పెట్టెల‌న్నీ గ‌ల‌గ‌ల‌లాడుతున్నాయి. న‌ల్ల కుబేరుల వ‌ద్ద ఉన్న న‌ల్ల‌ధ‌న‌మంతా బ‌య‌ట‌కు వచ్చేసిన‌ట్లేన‌ని కూడా కేంద్రం కాస్తంత గొప్ప‌గానే చెప్పుకుంది.

అంటే... కేంద్రం వ‌ద్ద ఇప్పుడు నిధుల‌కు ఎలాంటి కొర‌త లేద‌నే చెప్పాలి. నిధుల స‌మ‌స్య ఉన్న‌ప్పుడే... ప‌లు కీల‌క ప‌థ‌కాల‌కు శ్రీకారం చుట్టిన మోదీ... చేతి నిండా డ‌బ్బున్న నేప‌థ్యంలో ఇంకెలాంటి ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాలు చేప‌డ‌తారోన‌న్న వాద‌న కూడా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఈ నేప‌థ్యంలో మోదీ ఆశ‌యాల‌కు అనుగుణంగా దాదాపుగా మూడు నెల‌ల పాటు సుదీర్ఘ క‌స‌ర‌త్తు చేసిన అరుణ్ జైట్లీ ఎట్ట‌కేల‌కు నిన్న సాయంత్రానికంతా దాదాపుగా త‌న ప‌నిని ముగించేశారు. ఇక నిన్న రాత్రి నుంచే బ‌డ్జెట్ ప్రతుల ముద్ర‌ణ ప్రారంభ‌మైపోయింది. బ‌డ్జెట్ క‌స‌రత్తు పూర్తి కావ‌డం, ప్రతుల ముద్ర‌ణ ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్న నార్త్ బ్లాక్‌ లో ఆ శాఖ సిబ్బందికి కేంద్ర ఆర్థిక మంత్రి హ‌ల్వా విందు ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఆన‌వాయితీని కొన‌సాగిస్తూ... నిన్న సాయంత్రం నార్త్ బ్లాక్‌ లో పెద్ద క‌డాయిలో వండి వార్చిన హ‌ల్వాను ఆర్థిక మంత్రి హోదాలో అరుణ్ జైట్లీ ఉద్యోగుల‌కు అంద‌జేశారు. ఆ వెనువెంట‌నే బ‌డ్జెట్ ప్రతుల ముద్ర‌ణ కూడా ప్రారంభ‌మైపోయింది.

వ‌చ్చే నెల 1న పార్ల‌మెంటులో జైట్లీ బ‌డ్జెట్ ప్ర‌సంగం చేయ‌నున్నారు. అప్ప‌టిలోగానే బ‌డ్జెట్ ప్రతుల ముద్ర‌ణ కానుంది. ఈ ప్రతుల ముద్ర‌ణ‌లో పాలుపంచుకునే కేంద్ర ఆర్థిక శాఖ‌కు చెందిన సిబ్బందిలో దాదాపు వంద మంది అధికారులు నిమగ్నం కానున్నారు. ఈ విధుల్లో ఉండే సిబ్బంది నిన్న‌టి నుంచే ప్రింటింగ్ ప్రెస్‌ లోకి వెళ్లిపోయారు. బ‌డ్జెట్ ప్ర‌తుల ముద్ర‌ణ పూర్త‌య్యే దాకా వీరు బాహ్య ప్ర‌పంచంలో సంబంధాలు తెంచేసుకోవాల్సిందే. ఫోన్‌ - ఈ మెయిల్ - ఎస్ ఎంఎస్ త‌దిత‌ర ఎలాంటి స‌మాచార సాధ‌నం కూడా వీరు వినియోగించ‌డానికి వీల్లేదు. క‌నీసం కుటుంబ స‌భ్యుల‌తోనూ వీరు మాట్లాడేందుకు వీలుండ‌ద‌ట‌. బ‌డ్జెట్ ప్ర‌తుల ప్రింటింగ్ పూర్తి కాగానే... వీరు ప్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/