Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: అరుణ్ జైట్లీ కన్నుమూత

By:  Tupaki Desk   |   24 Aug 2019 7:25 AM GMT
బ్రేకింగ్: అరుణ్ జైట్లీ కన్నుమూత
X
గడిచిన కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన కేంద్ర మాజీ మంత్రి.. బీజేపీ సీనియర్ నేత.. మోడీకి అత్యంత సన్నిహితుడైన అరుణ్ జైట్లీ (66) తుది శ్వాస విడిచారు. ఈ నెల 8న ఊపిరి తీసుకోలేని కారణంగా ఎయిమ్స్ కు తరలించిన ఆయన పరిస్థితి అంతకంతకూ విషమంగా మారింది. గత శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ సందర్భంగా బీజేపీ అగ్ర నాయకత్వం ఆయన్ను పరామర్శించింది.

ఇదిలా ఉండగా ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన కన్నుమూసినట్లుగా ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. కొద్దిరోజులుగా వెంటిలేటర్ పై ఉన్న ఆయన ఆరోగ్యం మరింతగా విషమించినట్లు ఈ రోజు ఉదయం వెల్లడించారు. గడిచిన కొద్ది కాలంగా మూత్ర పిండాలు.. అంతుబట్టని క్యాన్సర్ వ్యాధితో బాధ పడిన ఆయన మరణం బీజేపీకి షాకింగ్ గా మారింది.

గడిచిన కొద్దికాలంలో బీజేపీకి చెందిన సీనియర్ నేతలు ఒక్కరొక్కరుగా ఆస్తమిస్తున్న తీరు ఆ పార్టీని షాకింగ్ కు గురి చేస్తోంది. 2014 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన మోడీ ప్రభుత్వంలో ఆర్థిక.. కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రిగా వ్యవహరించారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లటంతో ఆయన ఆ శాఖను నిర్వర్తించారు. 2016లో సమాచార ప్రసార శాఖ అదనపు బాధ్యతల్ని స్వీకరించారు.

ఈ ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి.. మోడీ సర్కారు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా అనారోగ్యం కారణంగా అరుణ్ జైట్లీ మాత్రం మంత్రివర్గంలో చేరలేదు. ఇటీవల అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్న ఆయన.. అనారోగ్యం కారణంగా మంత్రి పదవి తీసుకోవటానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన.. గడిచిన కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యారు.
జైట్లీ జీవిత విశేషాలు చూస్తే..

% 1952 డిసెంబరు 28న మహారాజ్‌ కిషన్‌ జైట్లీ, రత్నప్రభ దంపతులకు అరుణ్‌ జైట్లీ జన్మించారు.

% తండ్రి న్యాయవాది. 1960 నుంచి 1969 మధ్య కాలంలో పాఠశాల చదువంతా దిల్లీలోని సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌లో సాగింది.

% 1973లో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 1977లో దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. ఏబీవీపీ సభ్యుడిగా ఉన్నారు.

% 1974లో విశ్వవిద్యాలయ విద్యార్థి యూనియన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1982 మే 24లో అరుణ్‌ జైట్లీకి సంగీత డోగ్రీతో వివాహం జరిగింది.

% న్యాయ విద్య పూర్తయ్యాక 1977 నుంచి జైట్లీ సుప్రీంకోర్టు సహా, కొన్ని హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 1990లో దిల్లీ హైకోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌ హోదా లభించింది.

% 1991 నుంచి జైట్లీ భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 1999 అక్టోబరు 13న వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రిగా పని చేశారు.

% 2000 జులై 23న సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఏడాది నవంబరులో జైట్లీకి కేబినెట్‌ హోదా దక్కింది. 2009 జూన్‌ 3న రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.

% 2014లో మోడీ సర్కారులో కీలక భూమిక పోషించిన జైట్లీ.. మోడీషాలకు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు.