Begin typing your search above and press return to search.

రూ.2వేల నోటుపై టెన్ష‌న్ పెంచుతున్న జైట్లీ

By:  Tupaki Desk   |   27 July 2017 4:40 AM GMT
రూ.2వేల నోటుపై టెన్ష‌న్ పెంచుతున్న జైట్లీ
X
క‌ల‌లో కూడా ఊహించ‌ని కార్య‌క్ర‌మాలు చేయ‌టం మోడీ స‌ర్కారుకు మామూలే. ఇప్ప‌టికే త‌న‌దైన శైలిలో నిర్ణ‌యాలు తీసుకోవ‌టం ద్వారా ప‌లుమార్లు దేశ ప్ర‌జ‌ల‌కు షాకుల మీద షాకులు ఇచ్చిన మోడీ.. అదే త‌ర‌హాలో మ‌రో షాక్‌ కు గురి అవుతున్నారా? అన్న సందేహం క‌లిగేలా చేస్తున్నారు. పెద్ద‌నోట్లను ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్న ప్ర‌ధాని మోడీ.. అంతేలా కొత్త‌గా రూ.2వేల నోటును తెర మీద‌కు తీసుకొచ్చారు.

పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఏర్ప‌డే నోట్ల కొర‌త‌ను త‌గ్గించేందుకు వీలుగా.. సులువైన ప‌రిష్కారంగా రూ.2వేల నోటును తెచ్చార‌న్న అభిప్రాయం గ‌తంలోనే వెలువ‌డింది. గ‌తంలో అందుబాటులోకి వ‌చ్చిన నోట్ల‌ల్లో అత్యంత పెద్ద‌దైన రూ.2వేల నోటుకు ఎప్పుడో ఒక‌రోజు మోడీ స‌ర్కారు మంగ‌ళం పాడేస్తుంద‌న్న మాట బ‌లంగా వినిపించింది.

అయితే.. అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చిక్క‌క‌పోవ‌టం.. ఈ వాద‌న ఉత్త‌దే అన్న భావ‌న వ్య‌క్త‌మైంది. అయితే.. తాజాగా బ‌య‌ట‌కు వ‌స్తున్న వాస్త‌వాలు.. ఆర్థిక మంత్రి జైట్లీ రియాక్ట్ అవుతున్న తీరు చూస్తే.. రూ.2వేల నోట్ల‌కు కాలం చెల్లిపోయే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉందా? అన్న సందేహాలు క‌లిగేలా చేస్తున్నాయి.

కొత్త‌గా రానున్న రూ.200 నోట్ల ముద్ర‌ణ కోసం రూ.2వేల నోట్ల ప్రింటింగ్‌ ను నిలిపివేసిన‌ట్లుగా స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే.. షాకింగ్ విష‌యం ఏమిటంటే రూ.2వేల నోట్ల ప్రింటింగ్ నిలిపివేసి దాదాపు ఆర్నెల్ల‌కు పైనే అయ్యింద‌న్న అన‌ధికార స‌మాచారం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చి కొత్త సందేహాల‌కు తెర తీసింద‌ని చెప్పాలి.

ఈ నేప‌థ్యంలో రూ.2వేల నోటు ర‌ద్దు చేసే అంశంపై మ‌రింత క్లారిటీ కోసం పార్ల‌మెంటులో ప‌లువురు నేత‌లు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ జైట్లీ నుంచి మాత్రం స్ప‌ష్ట‌మైన స‌మాధానం రాక‌పోవ‌టం ఇప్పుడు కొత్త గుబులుకు కార‌ణ‌మ‌వుతుంది.
రాజ్య‌స‌భ శూన్య గంట‌లో ఎస్పీ ఎంపీ న‌రేశ్ అగ‌ర్వాల్ రూ.2వేల నోటును ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంద‌న్న ప్రచారాన్ని తెర మీద‌కు తెచ్చారు. రూ.2వేల నోటును ర‌ద్దు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందా? వ‌ఆటి ముద్ర‌ను నిలిపివేయాల‌ని ఇప్పటికే ఆదేశించిందా? కొత్త‌గా రూ.వెయ్యి నాణేన్ని తీసుకురానున్నారా? అన్న ప్ర‌శ్న‌ల్ని సంధించారు.

ఆయ‌నే కాదు.. విప‌క్ష నేత గులాం న‌బీ అజాద్ సైతం రూ.2వేల నోటు ర‌ద్దు.. రూ.100.. రూ.200.. రూ.1000 నాణెల్ని తీసుకురానున్నారా? అన్న ప్ర‌శ్న‌ను సంధించారు. అయితే.. ఈ ప్ర‌శ్న‌ల‌కు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూటి స‌మాధానం చెప్ప‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం కానీ ఈ విష‌యం మీద స్ప‌ష్ట‌త ఇవ్వ‌కుండా ప్ర‌జ‌లు ఈ వాద‌న‌లు నిజ‌మ‌ని న‌మ్ముతార‌ని విప‌క్ష నేత‌లు వ్యాఖ్యానించినా జైట్లీ మాత్రం రియాక్ట్‌ కాలేదు. విప‌క్ష నేత‌లు ప‌లువురు రూ.2వేల నోటు ర‌ద్దు.. కొత్త నాణెల్ని తీసుకురావ‌టంపై వ‌స్తున్న ఊహాగానాల్ని ఖండించ‌క‌పోవ‌టం చూస్తే.. మోడీ స‌ర్కారు త్వ‌ర‌లోనే మ‌రో సంచ‌ల‌నానికి తెర తీసే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. సో.. పెద్ద నోట్లు దాచిన వారికి కొత్త తిప్ప‌లు త్వ‌ర‌లోనే షురూ కానున్నాయా?