Begin typing your search above and press return to search.

ఏపీకి జైట్లీ ఏం చేస్తానన్నారంటే....

By:  Tupaki Desk   |   31 Aug 2016 5:39 AM GMT
ఏపీకి జైట్లీ ఏం చేస్తానన్నారంటే....
X
ఏపీ ప్రజానీకానికి భావోద్వేగ అంశంగా మారిన ప్రత్యేక హోదా మంజూరుకు అవకాశమే లేదని ఇంతకాలంగా చెబుతూ వస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా రాజకీయ నష్టనివారణ చర్యలకు సిద్ధమౌతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా పట్టుబడుతుండడానికి తోడు ఇటీవలనే బహిరంగంగా గళం విప్పిన జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమౌతుండడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన కేంద్రంలోని అధికార పార్టీ ప్రత్యేక హోదా గండం నుండి బయటపడేందుకు ప్రత్యామ్నాయ వ్యూహరచనపై దృష్టి సారించింది. పధ్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆమోదంతో రెండేళ్ల క్రితం కేంద్రం - రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ విషయంలో అమలులోకి వచ్చిన నూతన విధానంలో పెద్దగా ఒరిగేదేమీ లేకపోయినా రాష్ట్రానికి ‘నామమాత్రపు’ ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదాను ప్రకటించేందుకు సిద్ధమేననే సంకేతాలనివ్వడం ప్రారంభించింది.

ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన హామీకి అనుగుణంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తన నివాసంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ - సమాచార మంత్రి వెంకయ్యనాయుడు - టీడీపీకి చెందిన సహాయ మంత్రి సుజనా చౌదరిలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌ సమస్యలపై సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం ఆర్థికంగా తన సొంత కాళ్లపై నిలబడగలిగేలా చేయూతనివ్వడం కోసం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు పూర్వపు ప్రధాని పార్లమెంట్‌ కు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కూడా అమలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో పాటు విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలును లోతుగా అధ్యయనం చేసిన ఈ సమాలోచనల్లో ప్రత్యేక హోదాకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యతిరేకం కాదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యూహ రచనకు శ్రీకారం చుట్టినట్లు తెలియవచ్చింది. కేంద్రం పట్ల రాష్ట్ర ప్రజల్లో గూడుకట్టుకొని ఉన్న తీవ్ర వ్యతిరేకతను తగ్గించడం లక్ష్యంగా ఎంతో కాలంగా పెండింగ్‌ లో ఉన్న రైల్వే జోన్‌ వంటి అంశాలపై సత్వర నిర్ణయాలను ప్రకటించడం - పోలవరం ప్రాజెక్టుకు తగినన్ని నిధులను కేటాయించే అంశంపై దృష్టి సారించడంతో పాటు హోదా మంజూరుకు పధ్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సులతో ఎదురయ్యే న్యాయపరమైన అవరోధాలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తును చేపట్టాలని దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ కీలక సమావేశంలో నిర్ణయించినట్లు తెలియవచ్చింది.

ప్రత్యేక హోదా ఏపీ ప్రజల భావోద్వేగాలతో ముడివడిన అంశంగా గుర్తించిన బీజేపీ నాయకులు అతిత్వరలోనే రాష్ట్రాన్ని ఆదుకొనేందుకు కేంద్రం తీసుకోనున్న చర్యలతో ఒక ప్రకటన చేయడం అవసరమనే టీడీపీ నేతల వాదనతో ఏకీభవిస్తున్నట్లు పాలకపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పధ్నాలుగవ ఆర్థిక సంఘం నివేదిక అమలుకు ముందున్న విధానాన్ని పునరుద్ధరించడం సాధ్యపడదంటూనే ఇప్పటికీ కొనసాగుతున్న రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక సహాయ ప్రక్రియలో కేంద్ర ప్రాయోజిక పథకాలకు విడుదలయ్యే కేంద్ర నిధులలో ఆంధ్రప్రదేశ్‌ కు మాత్రం 60శాతానికి బదులుగా 90శాతాన్ని గ్రాంటుగా మార్పుచేసేందుకున్న అవకాశాలను పరిశీలించవచ్చునని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ సమావేశంలో ప్రతిపాదించినట్లు సమాచారం.

పధ్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సులను ప్రస్తుత ప్రభుత్వం ఆమోదించి అమలులోకి తీసుకురావడానికి ముందు దశాబ్దాలపాటు మొత్తం రాష్ట్రాలకు అందజేసే కేంద్ర సహాయంలో ముందుగా ముఫ్ఫై శాతం నిధులను ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదా ఉన్న రాష్ట్రాలకు అందజేసిన తర్వాతే మిగిలిన 70శాతాన్ని ఇతర అన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ జరిగేదని - అయితే, ఇప్పుడు ఆ విధానానికి కాలం చెల్లిందన్నది కేంద్రం వాదన. అలాగే, రాష్ట్రాలకు లభించే సాధారణ కేంద్ర సహాయంతో పాటు అదనపు ఆర్థిక సహాయంలోనూ హోదా ఉన్న రాష్ట్రాలకు 90శాతం నిధులను గ్రాంటుగా పరిగణించేవారు - వీటికితోడు - ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల అభివృద్ధి అవసరాల కోసం నూటికి నూరు శాతం నిధులను గ్రాంటు రూపంలో ప్రత్యేక కేంద్ర ఆర్థిక సహాయాన్ని అందజేసే అవకాశం కూడా గతంలో ఉండేది. అయితే, ప్రస్తుతం అమలులోకి వచ్చిన విధానంలో అవి ఏవీ అందుబాటులో లేనందున కేంద్ర ప్రాయోజిక పథకాల అమలు కోసం విడుదల చేసే నిధుల్లో - వాటితోపాటు - విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే అభివృద్ది ప్రాజెక్టుల వ్యయంలో 90శాతాన్ని కేంద్ర ప్రభుత్వ గ్రాంటుగా పరిగణించేలా ‘సరికొత్త ప్రత్యేక హోదా’ను ప్రకటించి అమలు చేసేందుకున్న అవకాశాలను పరిశీలించవచ్చునని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించినట్లు తెలియవచ్చింది. అలాగే, విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు హామీని త్వరగా అమలులోకి తేవాలని - పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్‌ రుణం రూపంలో అవసరమైన నిధులను సమకూర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని మరో బీజేపీ మంత్రి వెంకయ్యనాయుడు సూచించారని తెలియవచ్చింది.