Begin typing your search above and press return to search.

ఈ క్రికెటర్ సిడ్నీలో కారు డ్రైవర్!

By:  Tupaki Desk   |   1 Sep 2015 12:24 PM GMT
ఈ క్రికెటర్ సిడ్నీలో కారు డ్రైవర్!
X
ప్రస్తుత స‌మాజంలో లైఫ్‌ ని కింగ్ సైజ్‌ లో ఎంజాయ్ చేసేవారు ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న‌కు ఎంతోమంది యూత్ చెప్పే స‌మాధానం... అయితే, ఫిల్మ్ స్టార్స్‌, లేదా క్రికెట‌ర్లు! ముఖ్యంగా ఐపీయ‌ల్ వ‌చ్చిన ద‌గ్గ‌ర్నుంచీ క్రికెట‌ర్ల‌కి కోట్ల కొల‌దీ రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్ల రూపంలో వ‌చ్చిప‌డ‌తాయ‌ని అనుకుంటున్నారు. ఒక క్రికెట్ రిటైర్ అయ్యాక‌... కోచ్ అవుతాడు. లేదా, సొంతంగానే ఒక అకాడెమీ పెట్టేసుకుంటాడు. అదీ కాక‌పోతే... కెరీర్ మొత్తం సంపాదించుకున్న సొమ్ముతో సొంతంగా ఏ హోటలో, ప‌బ్బో పెట్టుకుని న‌డుపుతూ ఉంటాడు. ఒక క్రికెటర్ జీవితాన్ని ఇంత‌కంటే త‌క్కువ‌గా మ‌నం ఊహించ‌లేం! కానీ... కొన్ని జీవితాలు మ‌న ఊహ‌కు అంద‌వు. అలాంటి ఓ క్రీడాకారుడు... అర్షాద్ ఖాన్‌!

అప్పుడెప్పుడో ఐసీఎల్ మ్యాచ్‌ ల కోసం అప్పుడ‌ప్పుడూ హైద‌రాబాద్ వ‌చ్చే ఈ ఆట‌గాడు ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..? సిడ్నీలో ఉంటున్నాడు... అదీ ఒక టాక్సీ డ్రైవ‌ర్‌ గా! అవును.. ఈ విష‌యాన్ని గ‌ణేష్ బిర్లే అనే వ్య‌క్తి ఫేస్‌ బుక్ ద్వారా వెలుగులోకి తెచ్చాడు. గ‌ణేష్ త‌న ఫేస్‌ బుక్ అకౌంట్ లో అర్షాద్ గురించి ఇలా రాశాడు.

‘అత‌డు కారుకి డ్రైవ‌ర్‌ గా వ‌చ్చాడు. స‌ర‌దాగా మాటామాటా క‌లిపాను. పాకిస్థాన్ నుంచి వ‌చ్చి సిడ్నీలో ఉంటున్నాన‌ని చెప్పాడు. ఐసీఎల్‌ లో లాహోర్ బాద్షా టీమ్ త‌ర‌ఫున ఆడేందుకు చాలాసార్లు హైద‌రాబాద్‌ కి వ‌చ్చాన‌నీ చెప్పాడు. వెంట‌నే నేను షాక్ తిన్నాను. ఆ త‌రువాత పూర్తి పేరు అడిగాను. మొద‌ట్లో గుర్తుప‌ట్ట‌లేక‌పోయాను. ఆ త‌రువాత తెలిసింది.. షాక్ తిన్నాను’ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు గ‌ణేష్‌. అర్షాద్ అక్క‌డ మంచి డ్రైవ‌ర్‌ గా ప‌నిచేస్తున్నాడ‌నీ రాశాడు.

ఆఫ్ స్పిన్న‌ర్‌ గా అర్షాద్‌ కి మంచి పేరే వ‌చ్చింది. కానీ, పాకిస్థాన్ జాతీయ జ‌ట్టులో ఫుల్ టైమ్ ప్లేయ‌ర్‌ గా నిల‌దొక్కుకోలేక‌పోయాడు. ఆ త‌రువాత నెమ్మ‌దిగా ఫామ్ కోల్పోవ‌డంతో కెరీర్ దెబ్బ‌తింది. దాంతో... ఇలా బ‌తుకు ఈడ్చుకోవాల్సి వ‌స్తోంది! సో.. అంద‌రి క్రికెట‌ర్ల జీవితాలూ ఒకేలా ఉండ‌వు!