Begin typing your search above and press return to search.

'హిందూ పాకిస్థాన్' ఎఫెక్ట్..థరూర్ కు అరెస్ట్ వారెంట్

By:  Tupaki Desk   |   13 Aug 2019 5:41 PM GMT
హిందూ పాకిస్థాన్ ఎఫెక్ట్..థరూర్ కు అరెస్ట్ వారెంట్
X
శశి థరూర్... ఈ పేరు వినగానే వివాదాస్పద కామెంట్లకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన కాంగ్రెస్ నేత కళ్లెదుట కనిపిస్తారు. రాజకీయాల్లోకి రాకముందు ఐక్యరాజ్యసమితిలో పనిచేసిన వ్యక్తిగా ఆయనపై అందరికీ ఓ మోస్తరు ఎక్స్ పెక్టేషన్స్ ఉండేవి. అయితే రాజకీయాల్లోకి వచ్చాక... కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించిన తర్వాత ఆయన వ్యవహారం ఎప్పుడూ వివాదాస్పదమే. ఎప్పుడు మీడియాతో మాట్లాడినా, లేదంటే సోషల్ మీడియాలో ఎంటరైనా తనదైన శైలి కామెంట్లు చేసే థరూర్ ఇప్పటికే చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారనే చెప్పాలి. తాజాగా ఏడాది క్రితం తన నోటి నుంచి వచ్చిన ఓ హీటు కామెంటుకు సంబంధించి ఆయనకు ఏకంగా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.

ఈ వారెంట్ జారీకి దారి తీసిన పరిస్థితులను ఓ సారి పరిశీలిస్తే... గతేడాది కోల్ కతాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న థరూర్.. అప్పటికే ఓ టెర్మ్ అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు... మరోమారు అధికారం చేపడితే... దేశం హిదూ పాకిస్థాన్ గా మారిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మరోమారు అధికారంలోకి వస్తే... రాజ్యాంగాన్నే తిరగరాసే ప్రమాదం లేకపోలేదని, ఫలితంగా ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన నాయకులు దేశానికి స్వేచ్ఛ స్వాతంత్య్రాలు తీసుకువస్తే... రెండోసారి బీజేపీ అధికారంలోకి వస్తే... మైనారిటీల హక్కులను కాలరాస్తారని, అంతిమంగా సరికొత్త హిందూ పాకిస్థాన్ ఏర్పాటవుతుందని ఆయన కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు.

నాడు ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రేగాయి. థరూర్ మాత్రం ఎప్పట్లాగే ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండానే సాగిపోయారు. తాజాగా ముగిసిన ఎన్నికల్లో కేంద్రంలో మరోమారు ఎన్డీఏ సర్కారు కొలువైపోయింది. థరూర్ వ్యాఖ్యలు నిజమయ్యాయో, లేదో తెలియదు గానీ... ఆ వ్యాఖ్యల ఫలితంగా ఆయనకు ఏకంగా అరెస్ట్ వారెంట్ జారీ అయిపోయింది. నాడు థరూర్ చేసిన వ్యాఖ్యలపై కోల్ కతా కోర్టులో సుమిత్ చౌదరి అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు... థరూర్ కు నోటీసులు జారీ చేసింది. కోర్టు సమన్లను ఎంతమాత్రం పట్టించుకోని థరూర్... కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు. దీంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ ను జారీ చేస్తూ కోల్ కతా కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.