Begin typing your search above and press return to search.

మ‌మ‌త సెల్ఫ్ గోల్ రుజువైంది

By:  Tupaki Desk   |   2 Dec 2016 2:10 PM GMT
మ‌మ‌త సెల్ఫ్ గోల్ రుజువైంది
X
పశ్చిమ బెంగాల్‌లోని 18 జిల్లాల్లో గల టోల్‌ ప్లాజాల వద్ద ఆర్మీ భద్రతా సిబ్బందిని మోహరించ‌డంపై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ చేసిన ఆరోప‌ణ‌ల్లో ప‌స‌లేద‌ని తేలింది. త‌మ‌కు స‌మాచారం లేకుండా ఏ విధంగా ఆర్మీని మోహ‌రిస్తార‌ని మ‌మ‌తా ప్ర‌శ్నిస్తూ స‌చివాలయంలోనే త‌న‌కు తానుగా ఉండిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన నేప‌థ్యంలో ఆర్మీ అధికారులు స్పందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి మేర‌కే తాము సైనికుల‌ను పంపించామ‌ని తెలిపారు. ఈ మేర‌కు అధికారిక లేఖ‌ల‌ను విడుద‌ల చేశారు. దీంతో మ‌మ‌తా సెల్ఫ్ గోల్ చేసుకున్న‌ట్ల‌యింది.

ప‌శ్చిమ బెంగాల్ జీఓసీకి చెందిన మేజర్ జనరల్‌ సునీల్‌ యాదవ్ రాష్ట్ర ప్ర‌భుత్వ కార్యాల‌యాల నుంచి అందిన నాలుగు లేఖ‌ల‌ను మీడియాకు విడుద‌ల చేస్తూ... ఈ ర‌క‌మైన అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చిన త‌ర్వాతే తాము సిబ్బందిని పంపామ‌ని తెలిపారు. న‌వ‌బ‌రు 24నే అన్ని అనుమ‌తులు కూడా పొందామ‌ని తేల్చిచెప్పారు. దీంతో మ‌మ‌త ఉద్దేశ‌పూర్వ‌క హ‌డావుడిపై సందేహాలు నెల‌కొన్నాయి.

కాగా...పశ్చిమ బెంగాల్‌లోని 18 జిల్లాల్లో అందులోనే సెక్రటేరియట్‌ కు 500 మీటర్ల దూరంలోనే టోల్‌ప్లాజాను ఏర్పాటు చేసి ఆర్మీ జవాన్లు తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి, టోల్‌ ప్లాజాల వద్ద భద్రతను పర్యవేక్షించడానికి సాధారణ తనిఖీల్లో భాగంగా సిబ్బందిని మోహరించినట్లుగా ఆర్మీ పేర్కొంటుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈశాన్య రాష్ర్టాల్లోని అసోంలో 18 ప్రాంతాలు - అరుణాచల్‌ లో 13 -నాగాలాండ్‌ లో 5 - మేఘాలయలో 5 - త్రిపుర - మిజోరాంలలో ఒక ప్రాంతంలో తనిఖీలు చేపట్టినట్లు ఈస్ట్రన్ కమాండ్ ట్విటర్ ద్వారా పేర్కొంది. కాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఆర్మీని మోహరించడం ఏంటనీ మమతా ప్ర‌శ్నించారు. ఇది సైనిక కుట్రనా అని ఆమె ఆరోపించారు. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ మమతా గడిచిన రాత్రి నుంచి సచివాలయంలోని ఉండిపోయారు. ఈ ప‌రిణామం క‌ల‌క‌లం సృష్టించ‌డంతో ఆర్మీ వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/