Begin typing your search above and press return to search.

విలీనంపై నోటీసులు.. ఐదేళ్లలో తేలుతుందా?

By:  Tupaki Desk   |   13 Jun 2019 4:27 AM GMT
విలీనంపై నోటీసులు.. ఐదేళ్లలో తేలుతుందా?
X
తెలంగాణలో సీఎల్పీని టీఆర్ ఎస్ ఎల్పీలో విలీనం చేసిన వ్యవహారంపై కోర్టు విచారణ మొదలైంది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈ అంశంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విలీనం జరిగినట్టుగా ఉత్తర్వులు ఇచ్చిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తదితరులకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

నోటీసుల వరకూ ఓకే కానీ - ఇప్పట్లో ఈ అంశం తేలుతుందా? అనేదే అసలైన అనుమానం. తాము అంతా రాజ్యాంగబద్ధంగా చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి చెబుతోంది. రాజ్యాంగం మేరకే ఎవరైనా పాలన చేస్తారని, ఈ విలీనం కూడా రాజ్యాంగబద్ధమే అని తెలంగాణ రాష్ట్ర సమితి వాదిస్తోంది.

అయితే ఇది వరకూ ఇలాంటి విలీనాలు చెల్లుబాటు అయిన దాఖలాలు లేవు. మూడింట రెండు వంతుల మంది ఎంపీలు-ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీలు తమ ఫిరాయింపులను విలీనాలుగా అభివర్ణించుకున్నా.. కోర్టు అలాంటి వాటిని సమర్థించలేదు.

ఈ నేపథ్యంలో తెలంగాణ లో లెజిస్లేటివ్ విభాగం విలీనం చెల్లుబాటు అవుతుందా? అనేది సందేహంగానే మారింది. అయితే ఏదేమైనా ఇప్పుడప్పుడే ఈ అంశం గురించి తేలేది ఏమీ ఉండకపోవచ్చు. ఇలాంటి అంశాలు కోర్టుల్లో సుదీర్ఘ విచారణలు సాగే అవకాశం ఉంది.

ఇప్పుడు నోటీసులు ఇచ్చినా నోటీసులు అందుకున్న వారు స్పందిస్తారా? మళ్లీ నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందా? అనే దగ్గర నుంచి మొదలుపెడితే రానున్న నాలుగున్నరేళ్లూ ఈ అంశం పై విచారణ కొనసాగుతూ ఉండవచ్చు అని పరిశీలకులు అంటున్నారు.