Begin typing your search above and press return to search.

జరిగింది ఇది.. మీరే డిసైడ్ కండి..

By:  Tupaki Desk   |   24 March 2017 5:25 AM GMT
జరిగింది ఇది.. మీరే డిసైడ్ కండి..
X
ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు చూసినప్పుడు అవాక్కు అవ్వాల్సిందే. ఒక పథకం ప్రకారం అన్న రీతిలో విపక్ష నేత లేవనెత్తిన విషయాన్ని పక్కన పెట్టేసి..అప్పటివరకూ చర్చలో లేని విషయాన్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. ఆ విషయాన్ని హైలెట్ చేయటం.. శుక్రవారం కూడా అదే విషయాన్ని సభలో చర్చించాలన్న విషయాన్ని వెల్లడించటం చూస్తే.. అగ్రిగోల్డ్ విషయంలో బాబు సర్కారు ఎంతకంత భిన్నంగా వ్యవహరిస్తోందన్న భావన వ్యక్తం కావటం ఖాయం.

అగ్రిగోల్డ్ ఇష్యూ ఎంత సీరియస్ అన్నది.. బాధితుల సంఖ్యను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. మొత్తం 32 లక్షల కుటుంబాల్లోని 1.28 కోట్ల మంది అగ్రిగోల్డ్ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. నెలల తరబడి ఆందోళన చేస్తున్నా.. ఏపీ ముఖ్యమంత్రి పట్టనట్లు ఉన్నారే తప్పించి.. కల్పించుకొని వారిని పిలిపించి..ప్రభుత్వ పరంగా తాము ఏం చేయగలమన్న విషయాన్ని చెప్పటమే కాదు.. బాధితులు ఏం కోరుకుంటున్నారన్న విషయం మీద ఆయన ఫోకస్ పెట్టలేదని చెప్పాలి. అగ్రిగోల్డ్ ఇష్యూలో విపక్ష నేత వైఎస్ జగన్ ఆధారాలతో నిలదీస్తున్న వేళ..అధికారపక్షం తత్తరపాటు పడటమే కాదు.. ఇష్యూ మొత్తాన్ని డైవర్ట్ చేసిన వైనం విస్తుగొలిపేలా ఉంది. అయితే.. ఈ విషయంలో ఎవరి కోణం వారికి ఉంటుంది. అందుకే.. జరిగిందంతా 20 పాయింట్లలో చెప్పేస్తాం. అంతిమంగా మీరే డిసైడ్ అయిపోండి.

అసలు జరిగిందేమిటంటే..

1. జీరో అవర్ లో అగ్రిగోల్డ్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు స్టేట్ మెంట్.బాధితులకు న్యాయం చేస్తామన్న ప్రకటన. పోలీసుల అదుపులో లేని 11 మంది డైరెక్టర్లను పట్టిస్తే ఒక్కొక్కరికిరూ.10లక్షల చొప్పున బహుమానం అంటూ ప్రకటన. కేసుహై కోర్టులో ఉన్నందున ఆస్తుల్ని వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తానన్న హామీ.

2. ఈ ఇష్యూ మీద మాట్లాడేందుకు విపక్ష నేత జగన్ కు అవకాశం ఇచ్చారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.7300 కోట్లు అని.. బాధితులకు ఆ సంస్థ ఇవ్వాల్సింది కేవలం రూ.1182 కోట్లు మాత్రమేనని.. ఆ పని ప్రభుత్వం చేస్తే..డిపాజిటర్లు ఊరట చెందుతారన్న సూచన చేశారు. ఆగ్రిగోల్డ్ ఆస్తుల్నిమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తక్కువ ధరకే కొనుగోలు చేసే అంశాన్ని ప్రస్తావించారు.

3. మైక్ అందుకున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారవు అగ్రిగోల్డ్ చర్చను వదిలేసి.. ఆ స్థానంలో రుణమాఫీ విషయంలో విపక్ష నేత జగన్ గతంలో ప్రస్తావించిన ధర్మశ్రీ విషయాన్ని తీసుకొచ్చి.. అగ్రిగోల్డ్ భూములు తాను కొన్నట్లు రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తానని.. నిరూపించని పక్షంలో జగన్ రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. ఈ వ్యవహారంపై సభా సంఘాన్ని వేయాలని కోరారు.

4. మరోసారి స్పీకర్ అవకాశం ఇవ్వటంతో జగన్ మాట్లాడటం ప్రారంభించారు. ఉదయ్ దినకర్ అగ్రిగోల్డ్ కు చెందిన హ్యాయ్ లాండ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారని.. ఆయనకు చెందిన భూముల్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేశారని.. చర్యలు తీసుకుంటారో లేదో మీ ఇష్టం అని జగన్ చెబుతుండగా మైక్ కట్ అయ్యింది.

5. మాట్లాడే అవకాశం పొందిన అచ్చెన్నాయుడు ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ ను విపక్ష నేత స్వీకరిస్తున్నారో లేదో చెప్పాలంటూ వ్యక్తిగత దూషణకు దిగారు.

6. దీనిపై సమాధానం చెప్పేందుకుజగన్ కు అవకాశం ఇస్తున్నట్లే చెప్పి.. మైకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఇచ్చారు.

7. తాను భూములు కొన్నట్లు చెప్పిన ప్రత్తిపాటి.. తాను కొన్న భూములకు..అగ్రిగోల్డ్ కు సంబంధం లేదన్నారు.

8. జగన్ కు మైకు ఇస్తున్నట్లు చెప్పినప్పటికీ.. మాట్లాడే అవకాశం మంత్రి యనమలకు ఇచ్చారు. పత్తిపాటి విసిరిన సవాల్ కు ప్రతిపక్ష నేత కట్టుబడి ఉన్నారో లేదో చెప్పాలన్నారు. అగ్రిగోల్డ్ భూములు కొన్న ప్రత్తిపాటి ఇష్యూ మీద సభాసంఘాన్ని వేయాలని కోరారు. ఒకవేళ ఆరోపణలు అవాస్తవమని తేలితే.. విపక్ష నేతను వెలివేయాలని డిమాండ్ చేశారు.

9. స్పీకర్ మైకు ఇవ్వటంతో మాట్లాడిన జగన్.. ఉదయ్ దినకర్ అగ్రిగోల్డ్ కు చెందిన హాయ్ ల్యాండ్ డైరెక్టర్ గా ఉన్నారని.. సీఈవోగా వ్యవహరిస్తున్నరని.. భూములు కొనుగోలు ఇష్యూపై చర్యలు తీసుకోవటం.. తీసుకోకపోవటం సీఎం ఇష్టమన్నారు.

10. జగన్ కు మైక్ కట్ అయి బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుకు మాట్లాడే అవకాశం లభించింది. ప్రత్తిపాటి సవాల్ కు విపక్ష నేత కచ్ఛితంగా స్వీకరించాలన్నారు. రుణమాఫీకి సంబంధించి ధర్మశ్రీ అంశాన్ని ప్రస్తావించారు.

11. జగన్ కు మరోసారి మైక్ ఇస్తున్నట్లు స్పీకర్ చెప్పినా.. అంతలోనే యనమలకు అవకాశం ఇచ్చారు. ప్రత్తిపాటి సవాల్ నుస్వీకరిస్తున్నారో లేదో తేల్చిన తర్వాతే జగన్ కు మైకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

12. జగన్ మాట్లాడుతూ.. సభా సంఘం వేస్తే ఏమవుతుంది? ప్రివిలేజ్ కమిటీలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఏడుగురు సభ్యుల్లో ఆరుగురు అధికారపార్టీ సభ్యులే ఉంటారు.. వారు చెప్పిందే సభా సంఘం చేస్తుంది. సిట్టింగ్ సింగిల్ జడ్జితో విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు.

13. మళ్లీ జగన్ మైక్ కట్ అయి..అచ్చెన్నాయుడు మైక్ అందుకొని.. ఏం చేయాలో సభ నిర్ణయిస్తుంది. ప్రత్తిపాటి సవాల్ ను స్వీకరిస్తున్నారో లేదో జగన్ చెప్పాలి.. లేదంటే ఆయన్ను బహిష్కరిచాలని డిమాండ్ చేశారు.

14. జగన్ కు మైకు ఇస్తున్నట్లుగా చెప్పిన స్పీకర్.. అంతలోనే చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులకు అవకాశం ఇచ్చారు (ఆయన మాట్లాడటానికి ముందు.. సీఎం చంద్రబాబుతో ఆయన కాసేపు మాట్లాడారు) మైకు అందుకున్న ఆయన జగన్ పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ..జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో స్పీకర్ కోడెల వెల్లడించిన అంశాల్నిసాక్షి వక్రీకరించిందని.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పట్టుబట్టారు.

15. టీడీపీ ఎమ్మెల్యే అనిత కూడా ఇదే డిమాండ్ ను లేవనెత్తారు. మీడియా సమావేశంలో స్పీకర్ చెప్పిన మాటల్ని అసెంబ్లీలో చూపించాలన్నారు

16. జగన్ కు మైకు ఇస్తున్నట్లుగా ప్రకటించిన స్పీకర్.. సీఎం చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీంతో విపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబుమాట్లాడుతూ.. ప్రత్తిపాటి సవాలును స్వీకరిస్తారా? అని ప్రశ్నిస్తూ.. ఆరోపణలు అవాస్తవమని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అంటూ ప్రశ్నించారు. జాతీయ మహిళా పార్లమెంట్ కు ముందు స్పీకర్ కోడెల మాటల్ని వక్రీకరించిందని.. సాక్షిపై చర్యలు తీసుకోవాలన్నారు.

17. మాంత్రి సవాలును స్వీకరిస్తున్నారో తేల్చిచెప్పిన తర్వాతే మాట్లాడాలన్నస్పీకర్..జగన్ కు మాట్లాడే అవకాశమిస్తున్నట్లుగా చెప్పి.. తర్వాత మంత్రి కామినేనికి అవకాశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ మాటల్ని సాక్షి టీవీ..పత్రికలు వక్రీకరించాయని..వాటిపై చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేశారు.

18. స్పీకర్ మాట్లాడుతూ.. సభను వాయిదావేద్దామని.. తిరిగి సభ స్టార్ట్ అయిన వెంటనే నాటి మీడియా సమావేశానికి సంబంధించిన వీడియోను ప్రదర్శిస్తామన్నారు. సభలో వీడియోను ప్రదర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులఅంశంపై చర్చించకపోవటాన్ని నిరసిస్తూ విపక్ష సభ్యులు.. సభకో నమస్కారంఅంటూ బయటకు వచ్చేశారు. వీడియో ప్రదర్శన ముగిసిన తర్వాత.. జరిగింది ఇదేనని.. చర్యలు తీసుకునే నిర్ణయం సభదేనని అన్నారు.

19. అనంతరం మాట్లాడిన మంత్రి యనమల.. టీడీపీ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి.. గౌతు శ్యామసుందర శివాజీ.. బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ ‘సాక్షి’ పత్రిక, టీవీలపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

20. తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. శుక్రవారం సభ ప్రారంభమైన తర్వాత విపక్ష సభ్యులుఉన్నప్పుడు ఇదే వీడియోను మరోసారి ప్రదర్శించాలని స్పీకర్ కు సూచించారు. అగ్రిగోల్డ్ ఉదంతంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారాన్ని రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచుతున్నట్లుగా వెల్లడించి.. ఆ కంపెనీ ఆస్తుల్నివేలం వేసి బాధితుల్ని ఆదుకుంటామని..వారికి న్యాయం చేస్తామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/