మనమడి కోసం ఊరికెళితే..గన్ మెన్లను తిప్పి పంపారన్న ప్రచారం జరిగిందట!

Wed Sep 11 2019 11:19:09 GMT+0530 (IST)

టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తమకు సంబంధం లేకుండానే కొన్ని మీడియాలలోనూ.. సోషల్ మీడియాలోనూ తమపై వండి వార్చేస్తున్న కథనాలతో కిందామీదా పడుతున్నారు. తనకు ఏ మాత్రం సంబంధం లేని విషయంలో తనను ఇరికించి..బద్నాం చేస్తున్నట్లుగా వాపోతున్నారు శేరిలింగంపల్లి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.గడిచిన రెండు రోజులుగా ఆయనపై కొత్త తరహా ప్రచారం సాగుతోంది. తాజా మంత్రివర్గ విస్తరణలో పదవి రాని కారణంగా తన గన్ మెన్లను వెనక్కి పంపారంటూ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ లు పడుతున్నాయి. అయితే.. ఇందులో ఏ మాత్రం నిజం లేదని మండిపడుతున్నారాయన. జరిగింది ఒకటైతే.. జరుగుతున్న ప్రచారం మరొకటంటున్నారు.

గుంటూరులో ఉన్న తన మనమడ్ని చూసేందుకు ఊరికి వెళ్లానని.. ఆ సందర్భంగా వెంట గన్ మెన్లను తీసుకెళ్లలేదన్నారు. ఆ మాత్రం దానికే తాను ఏదో అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం చేశారన్నారు. రెండు రోజులు ఊళ్లో లేనందున.. గన్ మెన్లను తనతో తీసుకెళ్లనిదానిపై విపరీతమైన అర్థాల్ని తీసుకున్నట్లుగా ఆయన వాపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిన ప్రతిసారి గన్ మెన్లను తీసుకొని వెళ్లాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని.. అందుకే తాను వెంట తీసుకెళ్లనని.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే సమయంలోనూ అనుమతి తప్పనిసరి అన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ కు మంత్రి పదవి ఇవ్వటంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. తన మీద సాగుతున్న ప్రచారం నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లి.. తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్న వివరణ ఇచ్చుకోవటం గమనార్హం.