Begin typing your search above and press return to search.

శ్రీ‌వారి ఆభ‌రణాల‌పై చెన్నారెడ్డి షాకింగ్ కామెంట్స్!

By:  Tupaki Desk   |   22 May 2018 10:20 AM GMT
శ్రీ‌వారి ఆభ‌రణాల‌పై చెన్నారెడ్డి షాకింగ్ కామెంట్స్!
X
తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) పాల‌క మండ‌లికి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు కు మ‌ధ్య వివాదం న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. హఠాత్తుగా ర‌మ‌ణ దీక్షితులుతోపాటు మ‌రో ముగ్గురిని వ‌యో ప‌రిమితి పేరుతో తొల‌గించడంపై టీటీడీపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీలో అవ‌క‌త‌వ‌క‌ల‌పై తాను విమ‌ర్శ‌లు గుప్పించ‌డం వ‌ల్లే త‌న‌పై ప్ర‌భుత్వం కక్ష్య సాధింపు చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని ఆరోపిస్తూ...ర‌మ‌ణ దీక్షితులు ఢిల్లీలో ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్ట‌బోతున్న‌ట్లు వ‌దంతులు కూడా వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టీటీడీలోని పరిణామాలపై పురావస్తుశాఖ మాజీ డైరెక్టర్‌ పెద్దారపు చెన్నారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. టీటీడీకి శ్రీ కృష్ణ దేవరాయులు ఇచ్చిన విలువైన వజ్రాలు - ఆభరణాలు చాలా మాయమయ్యాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా చెన్నారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌తో ర‌మ‌ణ దీక్షితులు చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్ల‌యింది.

క‌లియుగ దైవం వెంక‌న్న‌ను శ్రీ కృష్ణ దేవరాయులు 7 సార్లు దర్శించుకున్నారని, ఆ సంద‌ర్భంగా శ్రీ‌వారికి విలువైన ఆభ‌రణాలు , వ‌జ్రవైఢూర్యాలు చాలా స‌మ‌ర్పించుకున్నార‌ని చెన్నారెడ్డి తెలిపారు. అయితే, వాటిలో చాలా ఆభ‌ర‌ణాలు కరిగించారని....చాలా వజ్రాలు విదేశాలకు తరలిపోయాయని చెప్పారు. ప్ర‌స్తుతం కృష్ణ దేవరాయలు ఇచ్చిన ఆభరణాలు, వజ్రాలు 10శాతం కూడా లేవన్నారు. శ్రీ‌వారికి భక్తులు స‌మ‌ర్పించిన అభరణాలపై 2012 లో తాను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఓ కమిటీ వేశాన‌ని, ఆ క‌మిటీ విచారణలో ఈ సంచ‌ల‌న విషయాలు వెల్లడ‌య్యాయని చెప్పారు. మరోవైపు టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఆ స‌మావేశం అనంత‌రం మీడియాతో ఈవో మాట్లాడారు. టీటీడీ నిధులు పార‌ద‌ర్శ‌కంగా ఖ‌ర్చు చేస్తున్నామ‌ని - దుర్వినియోగం కాలేదని చెప్పారు. ఆగమ శాస్త్రం ప్రకారమే నిర్మాణ పనులు చేప‌ట్టామ‌ని తెలిపారు. టీటీడీలో అన్ని అంశాలపై చట్టప్రకారం ముందుకు వెళతామన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించార‌ని చెప్పారు. శ్రీ‌వారి ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని, ఆ నివేదికను సీఎంకు అందచేసినట్లు తెలిపారు.