Begin typing your search above and press return to search.

మోడీ మనసు గెలుచుకున్న అరకు కాఫీ

By:  Tupaki Desk   |   7 Feb 2016 6:36 AM GMT
మోడీ మనసు గెలుచుకున్న అరకు కాఫీ
X
అరకు కాఫీ రుచిని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆహా! ఏం రుచి.. అంటూ మెచ్చుకున్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌ఆర్ విలేజిని ఆయన సందర్శించినప్పుడు అక్కడ జీసీసీ ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్ లో ఆయన దాన్ని సేవించారు. అరకు కాఫీ రుచి చూసిన ప్రధాని మోదీ దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అడిగి తెలుసుకున్నారు. కాఫీ రుచి చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా అరకు కాఫీ విశిష్టత గురించి ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. గిరిజన ఉత్పత్తులకు, ప్రత్యేకించి అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజి తెచ్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రముఖులు వచ్చే ఈ కార్యక్రమంలో అరకు కాఫీ స్టాల్ ను చంద్రబాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. దానికి ప్రధాని ప్రశంసలు దక్కడం విశేషం.

అనంతరం వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళలు - చేతి వృత్తుల కళాకారులతో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు. హస్త కళలకు మార్కెట్‌ లో డిమాండ్ ఎలా ఉంది.. మీకు ఏ మేరకు గిట్టుబాటు అవుతుందని ప్రధాని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నావికాదళం స్టాళ్లను సందర్శించారు. అక్కడ భారత నౌకాదళం ఆయుధ సంపత్తిని వివరిస్తూ ఏర్పాటు చేసిన పోస్టర్‌ ను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. భారత నావికాదళ ఆయుధ సంపత్తిని వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శన గురించి అడ్మిరల్ ఆర్‌ కె ధావన్ ఆయనకు వివరించారు. భారత్‌ కు సముద్రం వైపు నుంచి ముప్పురాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నదీ తెలియజేశారు. ఆ తరువాత భారత్ శాస్త్ర - సాంకేతిక రంగాల్లో సాధించిన కృషిని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన నమూనా ప్రదర్శనలను తిలకించారు. క్షిపణులు బ్రహ్మోస్ - అస్తద్రాన్ - టార్పెడోలు - నీటిలో ఉన్న వాటిని గుర్తించే పరికరాలు, నావికదళం ఉపయోగిస్తున్న హెలీకాప్టర్లు తదితర వాటిపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలు తిలకించారు. నావికాదళంలో ఏయే ఆయుధాలను ఉపయోగిస్తున్నదీ, కొత్త రకాలను గురించి తెలిపారు. తూర్పు తీర ప్రాంతం, బంగాళాఖాతం ప్రాంతంపై నిఘా ఏ విధంగా ఉంచుతున్నదీ భారత నావికాదళ అధిపతి ఆర్కే ధావన్ ప్రధానికి వివరించారు.