Begin typing your search above and press return to search.

వీడిన రోహిత్ తివారీ హత్య మిస్టరీ

By:  Tupaki Desk   |   24 April 2019 11:43 AM GMT
వీడిన రోహిత్ తివారీ హత్య మిస్టరీ
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, సీనియర్ నేత ఎన్డీ తివారీయే తన నాన్న అంటూ చివరి వరకూ కోర్టులలో పోరాడి గెలిచిన ఆయన కుమారుడు రోహిత్ తివారీ హత్య కేసు చిక్కుముడి వీడింది. ఇటీవలే అనుమానాస్పద స్థితిలో రోహిత్ తివారీ మరణించారు. ఈ కేసును చాలెంజింగ్ గా తీసుకున్న ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు కేసును ఛేధించారు.

వైవాహిక జీవితంలో వచ్చిన గొడవల కారణంగానే భర్త రోహిత్ ను భార్య నే హతమార్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు. భర్త రోహిత్ తాగిన మైకంలో ఉండగా.. ఆయన భార్య అపూర్వశుక్లానే హత్య చేసిందని పోలీసులు తేల్చారు. ఈ హత్యలో ఆమె ఎవరి సహాయం తీసుకోలేదని నిరూపితమైందన్నారు.

పోస్టుమార్టం నివేదికలో రోహిత్ తివారీ ఊపిరి ఆడకపోవడంతోనే మృతిచెందినట్లుగా వెల్లడైంది. దీంతోపాటు బయటి వ్యక్తులు ఎవరూ లోపలికి ప్రవేశించిన ఆధారాలు పోలీసులకు లభించలేదు. దీంతో ఈ హత్య ఇంట్లో వారి పనే అని అనుమానించిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే రోహిత్ భార్య అపూర్వను ఆదివారం అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పాటు ఇంట్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోలీసులు ఆమెనే అనుమానించారు.

ఫుల్లుగా తాగి వచ్చిన భర్త రోహిత్ తివారీ ని దిండుతో ఊపిరాడకుండా చేసి భార్య చంపిందని పోలీసులు వివరించారు. తాగి ఉండడంతో రోహిత్ ప్రతిఘటించలేకపోయాడని తెలిపారు. వివాహం విషయంలో భార్య అపూర్వ అసంతృప్తితో ఉందని అందుకే భర్తను హత్య చేసిందని తెలిపారు. హత్య తర్వాత సాక్ష్యాలను 90 నిమిషాల పాటు మాయం చేసి చివరకు ఆస్పత్రికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు.

రోహిత్ మరణంపై ఆమె తల్లి ఉజ్వల స్పందించారు. రోహిత్, అపూర్వ దంపతుల మధ్య చాలా రోజులుగా సఖ్యత లేదని.. పెళ్లైన మొదటిరోజు నుంచే వారి మధ్య విభేదాలున్నాయని అందుకే ఈ హత్యకు అపూర్వ పాల్పడి ఉంటుందని ఆమె వాపోయారు.