Begin typing your search above and press return to search.

మోడీషాల‌కు గ‌డువు ఇచ్చి తేల్చ‌మ‌న్న కేంద్ర‌మంత్రి!

By:  Tupaki Desk   |   22 Feb 2019 7:28 AM GMT
మోడీషాల‌కు గ‌డువు ఇచ్చి తేల్చ‌మ‌న్న కేంద్ర‌మంత్రి!
X
మోడీతో పెట్టుకోవ‌టం అంటే కొరివితో త‌ల గోకిన‌ట్లే. ఎవ‌రికి ఒక ప‌ట్టాన కొరుకుడు ప‌డ‌ని ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మమ‌త‌ను సైతం రోడ్డు మీద‌కు తీసుకొచ్చి రెండు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా చేసిన ఘ‌న‌త వారి సొంతంగా చెప్పాలి. వైరి ప‌క్షాన్ని.. నిన్ను విడ‌వ బొమ్మాళి అంటూ వ్య‌వ‌హ‌రించే మోడీ మాష్టారిని త‌ట్టుకొని నిల‌బ‌డాలంటే చాలానే శ‌క్తియుక్తులు ఉండాలి.

అందుకే చాలామంది నేత‌లు మోడీతో గొడ‌వ ప‌డే క‌న్నా.. స‌ర్దుకుపోతుంటారు. అయితే.. అంద‌రూ ఒక‌లా ఉండ‌రు క‌దా. రాజు కంటే మొండోళ్లు మామూలే. అలాంటి మొండిఘ‌టాల్లో ఒక‌రిగా చెప్పాలి అప్నాద‌ళ్ కు చెందిన కేంద్ర‌మంత్రి అనుప్రియా ప‌టేల్‌. మోడీ స‌ర్కారులో కేంద్ర‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆమె.. తాజాగా మోడీషాల‌కు షాకిచ్చారు.

మ‌హారాష్ట్ర.. త‌మిళ‌నాడులో తాము కోరుకున్న‌ట్లుగా మిత్రుల‌తో సీట్ల స‌ర్దుబాటులో స‌క్సస్ అయిన ఆనందంలో ఉన్న వారికి ఝుల‌క్ ఇస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీకిమిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న అప్నాద‌ళ్ నేత అనుప్రియ తాజాగా మాట్లాడుతూ.. బీజేపీ త‌మ స‌మ‌స్య‌ల్ని ప‌ట్టించుకోకుంటే తాము ఎన్డీయేకూట‌మి నుంచి త‌ప్పుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. ఏదో మాట అంటే మాట అన్న‌ట్లు కాకుండా.. అందుకు గ‌డువు కూడా ఇచ్చేసిన ఆమె..మోడీషాల రియాక్ష‌న్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక‌వేళ‌.. త‌న‌ను లైట్ తీసుకుంటే త‌న దారిన తాను వెళ్లేందుకు ఆమె రెఢీ అయ్యారు.

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో రెండు ఎంపీ స్థానాల్లో విజ‌యం సాధించిన అప్నాద‌ళ్ పార్టీలో చీలిక రావ‌టం.. అనుప్రియా ప‌టేల్ బీజేపీ వెంట ఉండి.. కేంద్ర‌మంత్రి ప‌ద‌విని సొంతం చేసుకున్నారు. మిత్ర‌ప‌క్షాల స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే విష‌యంలో బీజేపీ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేద‌ని.. త్వ‌ర‌లో పార్టీ స‌మావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెబుతున్నారు చూస్తుంటే.. పాత మిత్రులను వ‌దిలించుకుంటూకొత్త మిత్రుల‌తో ఉత్సాహంగా జ‌ట్టు క‌ట్టాల‌న్న ఆలోచ‌న‌లో మోడీషాలు ఉన్నారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఎక్క‌డిక‌క్క‌డ పాత మిత్రుల‌తో బంధాలు తెంచుకొని కొత్త మిత్రుల‌తో స్నేహం మోడీషాల‌కు ఎంత‌వ‌ర‌కు క‌లిసి వ‌స్తుందో చూడాలి.