Begin typing your search above and press return to search.

తూత్తుకూడి ఇంత‌గా భ‌గ్గ‌మన‌డం వెనుక‌..

By:  Tupaki Desk   |   23 May 2018 5:35 AM GMT
తూత్తుకూడి ఇంత‌గా భ‌గ్గ‌మన‌డం వెనుక‌..
X
భారీగా విధ్వంసం.. పోలీసు కాల్పులు...11 మంది ఆందోళనకారుల మృతి..ఇది స్థూలంగా తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటికోరిన్) స్టెరిలైట్ క‌ర్మాగారం వ‌ద్ద జ‌రిగిన హింసాకాండ ప‌రిచ‌య వ్యాక్యాలు. కాలుష్యకారక స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని స్థానికుల డిమాండ్ చేస్తూ ఆందోళ‌న బాట ప‌ట్ట‌గా...నిరసనపై తూటాల వర్షం కురియ‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే అస‌లేం జ‌రిగింది అనేది అంద‌రికీ ఆస‌క్తిని రేకెత్తించే అంశ‌మే. వివ‌రాల్లోకి వెళితే... భూగర్భ జలాలు కలుషితమవడానికి కారణమవుతున్న తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటికోరిన్) స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని స్థానికులు ఆందోళ‌న చేస్తుండ‌గా జ‌రిగిన ఈ కాల్పుల ఘ‌ట‌న ఊహించిన‌ట్లుగానే రాజ‌కీయ రంగు పులుముకుంది.

కాలుష్యానికి కారణమవుతున్న తూత్తుకుడిలోని వేదాంత సంస్థకు చెందిన స్టెరిలైట్ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని స్థానికులు గత వంద రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు మంగళవారం ఉదయం కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. విధ్వంసానికి దిగిన ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ, ప్రభుత్వ, పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం.. సుమారు ఐదువేల మంది ఆందోళనకారులు నల్ల జెండాలు పట్టుకొని స్టెరిలైట్ కర్మాగారం వైపు ప్రదర్శనగా వెళ్లేందుకు ప్రయత్నించారు.అందుకు పోలీసులు వారిని అనుమతించలేదు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించినందున ప్రదర్శనలకు అనుమతివ్వబోమని పోలీసులు చెప్పారు. దీంతో నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ మరో గుంపు మడత్తూరు గ్రామం నుండి ప్రదర్శనగా బయల్దేరింది. మొత్తంగా 20వేల మంది వరకు ఆందోళనకారులు కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ప్రదర్శనగా బయల్దేరడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తొలుత పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాటతో మొదలైన ఘర్షణ ఆ తరువాత తీవ్రస్థాయికి చేరింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ, వారి వాహనాలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. కొన్ని వాహనాలు, భవనాలకు కూడా నిప్పు పెట్టారు. వారిని అదుపు చేసేందుకు తొలుత పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆ తరువాత భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో 11 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు. తూత్తుకుడితోపాటు శ్రీవైకుండం, ఒడ్డపిదారం ప్రాంతాల్లో దుకాణాలను మూసివేశారు.

నేపథ్యమిదీ..

-తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ యూనిట్ ఏడాదికి 4 లక్షల టన్నుల రాగి కాథోడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా తన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా ఎనిమిది లక్షల టన్నులకు పెంచేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తున్నది.

-మరమ్మతు పనుల కోసం మార్చి 27న 15 రోజుల పాటు ఈ పరిశ్రమను మూసివేశారు. కానీ అప్పటి నుంచి అది తెరుచుకోలేదు.

-పర్యావరణ చట్టాలను కంపెనీ అమలు చేయడం లేదని పేర్కొంటూ ఏప్రిల్ నెలలో రాగిని కరిగించే పనులను కొనసాగించేందుకు తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు ఆ సంస్థకు అనుమతినివ్వలేదు.

-ఈ అంశంపై విచారణను కాలుష్య నియంత్రణ బోర్డుకు చెందిన అప్పీలేట్ అథారిటీ జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.

-రాగిని ఉత్పత్తి చేసే క్రమంలో వ్యర్థాలుగా బయటకు వచ్చే లోహపు తెట్టును స్టెరిలైట్ సంస్థ సమీపంలోని నదిలోకి వదులుతున్నదని, దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయమని పొల్యూషన్ బోర్డు వెల్లడించింది. ప్లాంట్‌కు సమీపంలోని బోరు బావుల్లో భూగర్భ జలాల విశ్లేషణను కూడా సంస్థ సమర్పించలేదని తెలిపింది.

-దీంతో ఆ సంస్థను మూసివేయాలని స్థానికులు గత వంద రోజులుగా ఆందోళన చేస్తున్నారు. లోహపు తెట్టు వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, అందువల్ల సంస్థ విస్తరణ పనులకు అనుమతినివ్వకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు.

-ఇదిలా ఉండగా, సంస్థను తెరిపించి రాగి ఉత్పత్తిని పునఃప్రారంభించాలని తూత్తుకుడి స్టీవ్‌ డోర్స్ అసోసియేషన్ (టీఎస్‌ ఏ) డిమాండ్ చేస్తోంది. ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక అతిపెద్ద ప్రైవేట్ సంస్థ స్టెరిలైట్ కాపర్ యూనిట్ అని, దాని మూలంగా 38 లక్షల టన్నుల సరుకును తాము రవాణా చేయగలుగుతున్నామని టీఎస్‌ ఏ అధ్యక్షుడు వేల్‌ శంకర్ చెప్పారు. ఆ కంపెనీని మూసివేయడం వల్ల దాని అనుబంధ పరిశ్రమలు మూతపడ్డాయని, వేల సంఖ్యలో కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారని తెలిపారు. మరోవైపు కాపర్ యూనిట్ మూత వల్ల రాగి ధరలు కూడా భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. దేశంలో 35 శాతం రాగి ఇక్కడే ఉత్పత్తి అవుతోంది.