వాక్ స్వాతంత్రంపై బాబు మళ్లీ దాడి!

Wed Sep 13 2017 18:10:49 GMT+0530 (IST)

ప్రజలకు తాము తప్ప ఉత్తమ పాలనను ఎవరూ అందించలేరని పదే పదే నీతులు చెప్పే ఏపీ సీఎం చంద్రబాబు .. వాస్తవంలో అదే ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్నారు. తన పాలనలోని లోపాలను ఎత్తి చూపినా వాస్తవాలు అనదగ్గవాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసినా చంద్రబాబు కు వ్యతిరేకంగా కామెంట్లు రాసినా.. ఆయన అస్సలు సహించలేకపోతున్నారు. ఓ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని ప్రజల భావోద్వేగాలకు కూడా అవకాశం ఇవ్వాలని వారు మంచి సూచిస్తే.. తప్పకుండా స్వీకరించాలన్న కనీస విషయాన్ని సైతం బాబు తుంగలో తొక్కుతున్నారు.సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన వారిపై ఉక్కుపాదం మోపుతూ వివిధ కేసుల్లో వారిని ఇరికిస్తున్నారు. అనవసరంగా వేధింపులకు గురిచేస్తున్నారు. గతంలో  రవీంద్ర ఇప్పాల ఇంటూరి రవికిరణ్ లను సోషల్ మీడియాలో కామెంట్లు చేశారనే కారణంగా అరెస్టులు చేయించిన బాబు.. ఆ తర్వాత ఐఏఎస్ మాజీ అధికారి అనికూడా చూడకుండా మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు భావ ప్రకటనపైనా ఉక్కుపాదం మోపారు. ఆయనను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలిగించారు. ఇదీ బాబు మార్కు ప్రజాస్వామ్యం అనిపించారు.

ఇక ఇప్పుడు తాజాగా...  వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణతో కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన తోట రాజేశ్ ను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే జయరాములు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు మరో మాట లేకుండా రాజేశ్ ను అరెస్టు చేశారు.  అంతకుముందు గుడివాడలో హైడ్రామా చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి పోలీసులు పేరుతో ఐదుగురు వ్యక్తులు రాజేశ్ ఇంటికి వెళ్లారు.

ఆయన ఇంట్లో లేకపోవడంతో ఫోన్ చేసి స్టేషన్ కు రప్పించారు. గుడివాడ రెండో టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చిన రాజేశ్ ను రాత్రికి రాత్రే వైఎస్సార్ జిల్లా బద్వేల్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆయనను రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాజేశ్ అరెస్ట్ పై పోలీసులు ఏమీ తేల్చకపోవడం అనేక అనుమానాలకు అవకాశం కల్పిస్తోంది.మరి ఏపీ పోలీసులు ఎప్పటికి మారతారో తెలియడం లేదు. భావప్రకటనను హరించే ఇలాంటి వ్యవస్థ ఎప్పటికి పోతుందా అని నెటిజన్లు ఎదురు చూస్తున్నారు.