Begin typing your search above and press return to search.

రాజమౌళిపై మోడీకి కంప్లయింటు

By:  Tupaki Desk   |   4 Feb 2016 11:42 AM GMT
రాజమౌళిపై మోడీకి కంప్లయింటు
X
బాహుబలి సినిమాకు ఇంతవరకు ప్రశంసలు - కితాబులు - పురస్కారాలు తప్ప ఎక్కడా వ్యతిరేకత రాలేదు. కానీ, తాజాగా మాత్రం బాహుబలి-2కు చిక్కులు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై ప్రధాని నరేంద్రమోడీకే ఏకంగా ఫిర్యాదు చేశారు. సినిమా విషయంలో ప్రధానికి ఫిర్యాదు చేయాల్సినంత అవసరం ఏముందని అనుకుంటున్నారా.... జంతు హక్కులకు భంగం కలిగిస్తున్నారన్న కారణంతో ఈ సినిమాపై ప్రధానికి కంప్లయింటు అందింది.

బాహుబలి చిత్ర బృందంపై చర్య తీసుకోవాలని జంతు హక్కుల సంఘం హెరిటేజ్ యానిమల్ టాస్క్ ఫోర్స్ డిమాండ్ చేసింది. బాహుబలి-2 చిత్రం కోసం ఈ చిత్ర బృందం నిబంధనలకు విరుద్ధంగా ఏనుగును ఉపయోగించిందని ఆ సంస్థ ఆరోపించింది. జంతు సంక్షేమ బోర్డ్ (యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నుంచి అనుమతి లేకుండా త్రిసూర్ లో ఆ సినిమా బృందం ఏనుగును షూటింగ్ కోసం ఉపయోగించుకుందని ఆ సంస్థ ఆరోపించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రధాని నరేంద్రమోడీకి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో బాహుబలి చిత్ర దర్శకుడు - నిర్మాత రాజమౌళి పైనా - కెమేరామెన్ - ఆ ఏనుగు యజమాని - మావటిపైనా చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది.

మరి సినిమాయే కదా అని మోడీ దీన్ని చిన్నగా తీసుకుంటారా... లేదంటే జంతు హక్కులపై స్పందిస్తారో చూడాలి. మరో విషయం ఏంటంటే బాహుబలి-2 దర్శకుడు రాజమౌళికి మొన్నమొన్నే ప్రధాని పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. అలాంటి గర్వించదగ్గ వ్యక్తిపై చర్యలు ప్రధాని సిఫార్సు చేస్తారో లేదో చూడాలి.