Begin typing your search above and press return to search.

ప్రజలు ఓడించాక పప్పు అంటూ హేళన చేయటమా?

By:  Tupaki Desk   |   23 Aug 2019 5:28 AM GMT
ప్రజలు ఓడించాక పప్పు అంటూ హేళన చేయటమా?
X
దూకుడు రాజకీయాల్ని ఇష్టపడటం.. వారిని అభిమానించి.. ఆరాధించే ప్రక్రియ మొదలై దాదాపు రెండు దశాబ్దాలకు పైనే అవుతోంది. గతంలో దుందుడుకు వైఖరి ఉన్న నేతలకు కీలక పదవులు ఇచ్చేందుకు ఆసక్తి చూపే వారు కాదు. ప్రజాజీవితంలో ఉండేవారు హుందాగా ఉండాలన్న మాట బలంగా వినిపించేది. అలాంటి రోజులు పోయి చాలానే కాలమైంది.

ఇప్పుడంతా దూకుడుకే పగ్గాలు ఇచ్చేసే పరిస్థితి. ప్రత్యర్థిని వెంటాడాలి. వేటాడాలి. అంతకు మించి.. వేదన చెందేలా చేయాలి. అక్కడితో ఆగకుండా అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా? అన్నట్లుగా ఫీలయ్యేలా చేసి.. ఛీ.. ఛీ నాలాంటోడు ఇలా ఆలోచించటం ఏమిటి? నేను.. మరింత రాటు దేలాలి. దెబ్బకు దెబ్బ తీయాలి. నేనేంటో చూపించాలి. నా సత్తా ప్రదర్శించాలి. ప్రత్యర్థి ఉనికి కోసం వెంపర్లాడాలి. ఉరుకులు పరుగులు పెట్టించాలన్న కసిని పెంచుకొని పవర్ కోసం ప్రయత్నాల్ని ముమ్మరం చేసే పరిస్థితికి చేరుకోవటం ఇప్పుడు చాలామంది నేతల్లో కనిపిస్తుంది.

ఇలా మొదలయ్యే ప్రతీకార రాజకీయాలు ఒక పట్టాన ఆగవు. కత్తి పట్టుకున్నోడు తాను పట్టిన కత్తికే ఖతమవుతారన్న మూల సూత్రాన్ని ఇప్పటితరం నేతలు మిస్ అయి చాలాకాలమే అయ్యింది. కాలానికి తగ్గట్లు.. ట్రెండ్ కు సూట్ అయ్యేలా దూకుడుతనాన్ని నరనరాన నింపుకొని.. ఎదుటి వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవాన్ని అస్సలు ఇవ్వకుండా ఎటకారం చేసుకోవటం.. ఎంత వీలైతే అంత ఎక్కెసం చేసే ధోరణి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంగతే చూడండి.

ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతల్ని పూచిక పుల్లలా తీసేస్తారు. చంద్రబాబు.. లోకేశ్ బాబుల్ని ఎంతలా చులకన చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలా అని బాబు.. చినబాబులు ఏదో కారణజన్ములని చెప్పటం ఇక్కడ మా ఉద్దేశం కాదు. వారు చేసిన దరిద్రపుగొట్టు రాజకీయాలకు తగ్గట్లే.. ఇప్పుడు వారీ పరిస్థితి ఫేస్ చేస్తున్నారని చెప్పాలి. కాకుంటే.. వారు చేసిన తప్పులకు ప్రజాక్షేత్రంలో వారికి పడాల్సిన శిక్ష వారికి పడింది. ప్రజలు వారికి దారుణమైన ఓటమిని ఇచ్చి.. ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అది కూడా కేవలం 23 సీట్లతో.

అలాంటివేళలో తమ ప్రభుత్వంపై వారు చేసే విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వాలి. అలా అని.. ఇష్టారాజ్యంగా.. మనసుల్ని నొచ్చుకునేలా.. అవహేళన చేసేలా వ్యాఖ్యలు చేయటంలో అర్థం లేదు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ను పప్పు అంటూ ఎక్కెసం చేయటం తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేశ్ ను అలా అనటం అంతో ఇంతో అర్థం చేసుకోవచ్చు. కానీ.. అధికారపక్షంగా ఉండి కూడా ఇలాంటి మాటలు మాట్లాడటం సముచితంగా ఉండకపోవటమే కాదు.. అందరి మనసుల్ని గెలుచుకోదన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు.

ప్రాజెక్టులలో నీటిని ఉంచటం.. దాన్ని క్రమపద్ధతిలో కాకుండా తమకు ఇష్టం వచ్చినట్లుగా నీటిని దిగువకు వదిలేశారని.. ఈ కారణంతోనే రెండు జిల్లాల వారు ఇబ్బందులు పడుతున్నట్లుగా లోకేశ్ విమర్శించటం తెలిసిందే.

ఇలాంటి ఆరోపణలకు.. విమర్శలకు.. గణాంకాలతో సమాధానం ఇస్తే బాగుంటుంది కానీ.. తాత.. తండ్రి పేర్లు చెప్పుకొని బతికే ఆంధ్రా పప్పు లోకేశ్ కు తన గురించి మాట్లాడే అర్హత లేదన్న దూకుడు మాటలు వినేందుకు బాగానే ఉన్నా.. రానున్న రోజుల్లో మరిన్ని కీలక పదవులు చేపట్టాలన్న ఆలోచన ఉన్న ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మంచిది కాదన్న విషయాన్ని ఆయనకు ఎవరు చెప్పాలి. ఇప్పుడెంత తెగువుగా మాట్లాడితేనే.. అంత క్రేజ్ అని ఆయన నమ్మితే ఎవరు మాత్రం ఏం చెప్పగలరు?