Begin typing your search above and press return to search.

'కొప్పుల' వల్లే కాంగ్రెస్‌ ఓడిందా..?

By:  Tupaki Desk   |   19 Feb 2019 5:00 AM GMT
కొప్పుల వల్లే కాంగ్రెస్‌ ఓడిందా..?
X
అంతా ఆయనే చేశారంటున్నారు.. తన వారికే ప్రాధాన్యత ఇచ్చి తన వర్గాన్ని పెంచి పోషించారంటున్నారు.. అదే కొంప ముంచిందంటున్నారు. అందుకే ఇప్పుడు ఓడిపోయాక ఆయననంతా టార్గెట్‌ చేస్తున్నారు. మొత్తం మీద రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ఆయనంటే గిట్టడం లేదు. ఇంతకీ ఆయనెవరు..? అటు తెలంగాణ నాయకులు కూడా సిన్సియర్‌ అనుకొన్న ఈ కాంగ్రెస్‌ నాయకుడికి వ్యతిరేకంగా తాజాగా రాహుల్‌ గాంధీకి లేఖ రాశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కొప్పుల రాజు పేరు మారుమోగుతోంది. ఆయనపై కొందరు గుర్రుగా ఉంటే మరికొందరు సాఫ్ట్‌ నేచర్‌ తో కలిసి పోతున్నారు. ఇక ఫైర్‌ బ్రాండ్‌ రేణుకాచౌదరి - కిశోర్‌ చంద్రదేవ్‌ లు కొప్పుల రాజును టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అవగాహన లేకుండా వ్యవహరించడంతో పాటు తన సామాజికవర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నారని కొప్పుల రాజుపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సాఫ్ట్‌ గా కనిపించే మాజీ మంత్రి కిశోర్‌ చంద్ర దేవ్‌ కూడా కొప్పుల రాజుపై రాహుల్‌ గాంధీకి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందన్న చర్చ మొదలైంది.

మరోవైపు బీసీ సామాజిక వర్గాల నేతలు మాత్రం కొప్పుల రాజు తమకు ప్రాధాన్యత ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ దళితుల్లో మాదిగలు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. మాలలు మాత్రం ఆయనను అందలానికి ఎత్తుతున్నారు. రేణుకాచౌదరి వంటి వారు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వ్యవహారం వల్లే ఓడిపోయామని మీడియా ముందు విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఇప్పుడు కొప్పల రాజే టార్గెట్‌ అవుతున్నారు. కొప్పుల రాజు పార్టీ ప్రయోజనాలను పట్టించుకోకుండా తన సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు ఇప్పిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీని నేరుగా కలిసి ఓటమికి కారణాలు చెప్పేందుకు ప్రయత్నించినా చాలామందికి అపాయింట్‌ మెంట్‌ దొరకకపోవడానికి ఆయనే కారణమంటున్నారు. తెలంగాణ ముఖ్య నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉండడం గమనార్హం. పాలమూరు జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్‌ నేతలు కొప్పుల రాజుపై బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ నాయకుడికి ఏఐసీసీ పదవి రావడం వెనుక కూడా కొప్పుల హస్తం ఉందన్నది వారి అభిప్రాయం. ఏఐసీసీ పదవులు కూడా రాష్ట్ర నేతలకు తెలియకుండా కొప్పల రాజు ఏక పక్షంగా తన వర్గానికే ఇప్పించుకుంటున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది కాంగ్రెస్‌ నేతల్లో.

ముఖ్యంగా తెలంగాణలో ఓ కీలక పదవి దక్కించుకున్న నేతకు కొప్పుల రాజు మద్దతు ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. ఇలా తెలంగాణ - ఏపీలో అన్నీ తానై నడిపిస్తూ పార్టీలో పనిచేసే నాయకులకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని - సీనియర్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో కొప్పుల రాజు అనవసర జోక్యం చేసుకున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే రాష్ట్ర పార్టీలో ఓ కీలక నేత అండదండతో రాజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్‌ ఓటమికి కారణాలను నేరుగా రాహుల్‌ గాంధీకి చెప్పాలని చాలా మంది నేతలు ప్రయత్నిస్తున్నారని - అయితే కొప్పల రాజు అడ్డుకుంటూ రాహుల్‌ గాంధీని కలవకుండా చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పొత్తుల విషయం ఆయన అత్యుత్సాహం చూపించారని - రాజకీయంగా వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని రేణుకాచౌదరి వంటి సీనియర్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌లో కొప్పల రాజు మీద కాక రేపుతోంది. అంతా ఆయనే చేశారని అంటుండడం - రాహుల్‌ గాంధీ ముందు పంచాయతీ పెడుతామని చెబుతుండడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.