Begin typing your search above and press return to search.

ఇంకా ఎందాక‌.. ఈ దిగ‌జారుడు!

By:  Tupaki Desk   |   17 Aug 2018 1:30 AM GMT
ఇంకా ఎందాక‌.. ఈ దిగ‌జారుడు!
X
తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకుల నోరు నానాటికి దిగజారుతోంది. కనీస మర్యాద కూడా పాటించకుండా ఎదుటివారిని కించపరుస్తున్నారు. ఇది తారాస్దాయికి చేరుకుంటోంది. రాయడానికి కూడా అవకాశం లేని బూతులు వాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు సన్నాసులు - చేతకాని వాళ్లు - లుచ్చాగాళ్లు అంటూ కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్దాయిలో మాట్టాడడం ప్రజలకు మింగుడుపడడంలేదు. ఒకప్పుడు మర్యాదకు, గౌరవాలకు స్దానం ఉన్న తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు రాజకీయాలు మరీ దారుణంగా మారాయి. వ్యక్తిగత విమర్శలకు గతంలోనూ తావున్నా ఇప్పుడవి తారాస్దాయికి చేరాయి. ఇది ఆ పార్టీకీ, ఈ పార్టీకి అని కాదు. ఆ వ్యక్తి ఈ వ్యక్తీ అని కాదు. అన్నీ పార్టీలోను ఇదే పరిస్థితి. ప్రజలలో ఎలాంటి స్పందన వస్తుందన్న భయమూ లేదు. మాటల తూటాలను పేల్చడమే నేటి నాయకుల తీరుగా మారుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకుడు జగన్ పై చేస్తున్న దాడి కూడా దారుణాతి దారుణంగా ఉందని రాజకీయ పండితులంటున్నారు. గజదొంగ అని - మోసగాడు అని తెలుగుదేశం నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల చంద్రబాబు నాయుడు కూడా స్పందించకపోవడం వారిని వారించకపోవడం ప్రజలలో చర్చగా మారింది. ఇప్పటికే రాజకీయాల పట్ల ప్రజలలో ఏహ్యభావం పెరిగింది. ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలు వ్యక్తిగత దూషణలు చూసి తెలుగు ప్రజలు అస‍‍హ్యించుకుంటున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులా మనకు ఉన్నది అని ఏవగించుకుంటున్నారు. రాజకీయ నాయకులలో మార్పు రాకపోతే వారికి సరైన గుణపాఠం చెప్తామని అంటున్నారు. ఈ తిట్ల దండకానికి ముందు నాందీ వాచకం పలికింది తెలంగాణలోని పార్టీలే. తెలంగాణ‌ ఉద్యమ సమయంలో ప్రారంభమైన ఈ తిట్ల దాడి తెలంగాణ వచ్చిన తర్వాత... ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మారలేదు. ఇక్కడి అధికార పార్టీ నాయకులే కాదు... ప్రతిపక్షాలకు చెందిన వారు - ఆ మాటకొస్తే నిన్న మొన్న పుట్టిన పార్టీల నాయకులు కూడా ఇదే భాషను వాడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు అప్పటికప్పుడు సభికులను ఆనందపరచవచ్చు కాని.... ఆ తర్వాత వారిలో ఆలోచనలను రేకిత్తిస్తాయి. ఈ మాటలను నిలువరించుకోవాల్సిన కనీస బాధ్యత ఆయా పార్టీలకు చెందిన నాయకులే ఉందని, ప్రజలు వారిని మార్చలేరని విశ్లేషకులు అంటున్నారు. రానున్న ఎన్నికల సీజన్‌ లో ఇలాంటి మాటలు మరింకెన్ని వినాల్సి వస్తుందో అని తెలుగు రాష్ట్రాల ప్రజలు బెంబేలెత్తుున్నారు.